భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం బయోమెట్రిక్ హాజరు, ప్రజావాణితో పాటు ఇతర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బయోమెట్రిక్ హాజరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, తీవ్రతను బట్టి వేతనం నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలని, వారు హాజరు కాలేని పక్షంలో తదుపరి అధికారిని పంపాలని సూచించారు.
గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్వహించే వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లకు ప్రతిఒక్కరూ విధిగా హాజరుకావాలన్నారు. ప్రోటోకాల్స్‌లో లోటుపాట్లు కలిగితే చర్యలు తీసుకుంటామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు కావాలని అన్నారు. భద్రాచలం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం వైకుంఠ ఏకాదశి ముక్కోటి మహోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించే సమీక్షా సమావేశానికి అధికారులు సమగ్ర కార్యాచరణ నివేదికలతో హాజరుకావాలన్నారు. సమావేశంలో ఆర్డీవో రవీంద్రనాథ్ పాల్గొన్నారు.