వైరాటౌన్, ఆగస్టు 21 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను తాగునీటి అవసరాలకే ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు ఏన్కూరు మార్గంలో నిమ్మవాగు ద్వారా వైరా చెరువుకు చేరుతున్న నీటిని, ఏన్కూరు వద్ద సీతారామ కాల్వ 18ఎల్ లింక్(రాజీవ్ సాగర్) ద్వారా సాగర్ కాల్వకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏన్కూరు ఎన్నెస్పీ 52వ కిలోమీటర్ వద్ద ఉన్న రెగ్యులేటర్ను పరిశీలించి నీటిమట్టం, ప్రవాహం తదితర వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కల్లూరు మండలం పాయపూర్ వద్ద మధిర బ్రాంచ్ కెనాల్ ద్వారా పుణ్యపురం మేజర్ కాల్వ ద్వారా చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. కల్లూరుబత్తులపల్లి మార్గంలో ఎన్నెస్పీ 21వ ప్రధాన కెనాల్ ద్వారా కల్లూరు పెద్ద చెరువుకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. కప్పలబంధం వద్ద ఎన్నెస్పీపై మధిర బ్రాంచ్ కెనాల్ చీలిపోయే 72వ కిలోమీటర్ ప్రాంతాన్ని తనిఖీ చేసి, నీటి ప్రవాహం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధిర బ్రాంచ్ కెనాల్ నుంచి చీలిపోయే అవుట్ ద్వారా మేజర్ కాల్వకు చేరుతున్న నీటిని వెన్నవల్లి నేలపాడు, తెలగవరం గ్రామాల వద్ద పరిశీలించారు. మధిర బ్రాంచ్ కెనాల్ 24వ మీటర్ వద్ద ఏపీ – తెలంగాణ రాష్ర్టాల సరిహద్దులో ఉన్న రెగ్యులేటర్ను కూడా కలెక్టర్ పరిశీలించారు.
వేంసూరు మండలం లంకాసాగర్ చెరవుతోపాటు వివిధ చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్.. ఆయా చెరువులకు నీరు చేరుతున్న విధానం, నీటి లభ్యత తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో కృష్ణా బేసిన్ పరిధిలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నదని, ఈ నేపథ్యంలో గోదావరి నుంచి తరలిస్తున్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరిగేషన్ సీఈ వాసంతి, ఖమ్మం ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, కల్లూరు ఎస్ఈ శ్రీకాంత్, వైరా ఈఈ బాబురావు, సత్తుపల్లి ఈఈ అర్జున్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.