మామిళ్లగూడెం, మే 6:రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు నిర్ణీత సమయానికి సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మీసేవ, భూ భారతి, సాదాబైనామా, ప్రభుత్వ భూములు, పెండింగ్ సర్వేలు, ఇసుక, ఎస్ఐఆర్ వంటి అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు. 2014 జూన్ 2కు ముందు జరిగిన లావాదేవీలకే ప్రాధాన్యమివ్వాలని, దరఖాస్తుదారుల స్వాధీనంలోనే భూమి ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వ భూమిని ఒక్క అంగుళం కూడా రెగ్యులరైజ్ చేయొద్దని, సరైన ఆధారాలు లేకుండా భూమి యాజమాన్యం మారకూడదని స్పష్టం చేశారు.
భూమి స్థితిగతులపై పొరుగు పట్టాదారుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. భూ భారతి పెండింగ్ స్లాట్లపై సమీక్షిస్తూ.. రిజిస్ట్రేషన్ జరగని ప్రతి స్లాట్‌కు కారణాలు నమోదు చేయాలన్నారు. నిర్దిష్ట సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయని వారి స్లాట్లు రద్దు అవుతాయనే ముందస్తు సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఇవ్వాలని ఆదేశించారు. భూ భారతి క్లియరెన్స్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రతి రోజూ 3 మండలాల నుంచి క్లియర్ చేసిన ఫైళ్లను జిల్లాస్థాయి ఆపరేటర్ మండల అధికారులతో సమన్వయం చేస్తూ పంపిన ప్రతి ఫైల్‌కు భౌతిక ప్రతులు తప్పనిసరిగా జిల్లా కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తులపై మాట్లాడుతూ.. అసైన్మెంట్ భూములను మినహాయించి మిగతా దరఖాస్తులను మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. మీసేవా దరఖాస్తులను తహసీల్దార్లు నిర్ణీత సమయానికి క్లియర్ చేయాలని సూచించారు. పౌర సేవల దరఖాస్తుల్లో పెండెన్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.
తదుపరి సమీక్ష నాటికి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో లభ్యమయ్యే ప్రభుత్వ భూముల వివరాలు, విస్తీర్ణం, అభివృద్ధి కార్యక్రమాలకు అనుకూలతపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నేలకొండపల్లిలో ఇప్పటికే స్వయం సహాయక సంఘానికి పెట్రోల్ బంక్ కోసం భూమి కేటాయించిన నేపథ్యంలో రైస్ మిల్ ఏర్పాటు కోసం మరో 5 ఎకరాల భూమి లభ్యతపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 2025 ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో మార్గదర్శకాల ప్రకారం ఎస్ఐఆర్ మ్యాపింగ్ నిర్వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇసుక సమస్యలు రాకూడదని స్పష్టం చేశారు. ప్రజావాణి దరఖాస్తుల్లో ఏ వినతి కూడా 15 రోజలకు మించి పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.