ఖమ్మం/ మామిళ్లగూడెం, నవంబర్ 21: ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్ల వెంట ఫుట్‌పాత్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, రాంగ్ రూట్లో డ్రైవింగ్‌ను అరికట్టేందుకు కూడా పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం నగరంలో ప్రధాన రోడ్ల వెంట పుట్ పాత్ల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్‌తో కలిసి మాట్లాడారు.
నగరంలోని వైరా రోడ్డు, బైపాస్ రోడ్డు, ఇల్లెందు రోడ్డు వంటి 8 ప్రధాన రోడ్ల వెంట ఫుట్‌పాత్‌లు ఏర్పాటుచేసేందుకు; వాటిపై ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్, టైల్స్, సైకిల్ ట్రాక్ వంటివి ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అవసరమైన చోట ఫుట్‌పాత్ వద్ద బస్ బే సైతం ఉండేలా ప్లాన్ చేయాలని సూచించారు. దేశంలో ఇతర నగరాల్లో ఉన్న డిజైన్లను పరిశీలించి.. ఖమ్మం నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి డిజైన్ తయారు చేయాలని ఆదేశించారు. నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్‌ను అరికట్టడానికి ఏఐ సాంకేతికను వినియోగించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్పిపల్ డీఈఈ ధరణికుమార్ తదితరులు పాల్గొన్నారు.