మామిళ్లగూడెం, జూన్ 20 : విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి విపత్తుల నిర్వహణపై ఎన్డీఆర్ఎఫ్ బృందం, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో మూడు నెలలపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్టేషన్లో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రిహాబిలిటేషన్ సెంటర్లను ముందుగా గుర్తించాలని, అవసరమైతే ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను కూడా సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు మ్యాపింగ్ చేసి సోమవారం నాటికి వివరాలు అందించాలని ఆదేశించారు.
వరద హెచ్చరికలు రాగానే జిల్లాలో హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవాలని, బోట్లు, రోప్, లైఫ్ జాకెట్స్, మైకులు, లైట్లు, జేసీబీ, క్లీనింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ మండలంలో విపత్తుల నివారణకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పద్మశ్రీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కమాండర్ గౌతమ్, ఏఎస్ఐ మద్దలేటి, సిబ్బంది సురేశ్‌కుమార్, జగదీశ్, రియాజుద్దీన్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.