మామిళ్లగూడెం, జూలై 11: విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ శ్రీజ సహా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన పిల్లలకు మెరుగైన విద్యనందించాలని సూచించారు. విద్యార్థుల దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల పంపిణీ వివారలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 15 నాటికి ప్రతి విద్యార్థికీ రెండో జత దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేసి అప్డేట్ చేయాలని సూచించారు. పాఠశాలల తనిఖీ సమయంలో విద్యార్థులు యూనిఫామ్ వేసుకుని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో చేపట్టిన ఎన్రోల్మెంట్, మౌలిక వసతుల కల్పన వివరాలు యూడైస్‌లో మండల విద్యాధికారులు అప్డేట్ చేయాలని, మండలాల వారీగా విద్యార్థులకు అవసరమైన బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు సీఎస్సీల ద్వారా క్యాంపులు పెట్టాలని సూచించారు. విద్యార్థులు మూడు రోజులు పాఠశాలకు రాకుంటే ఫాలోఅప్ చేయాలని, హెడ్ మాస్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేసిన పనులకు హెచ్ఎంలు, ఎస్‌ఎంసీల చైర్మన్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు సంతకాలు పెడితేనే పూర్తిస్థాయి చెల్లింపులు జరుగుతాయని అన్నారు.
కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. యాతాలకుంట, రేజర్ల, పినపాక గ్రామాల్లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు అంశంపై కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశలంలో ఆయన మాట్లాడారు. యాతాలకుంటలో 40, రేజర్లలో 20, పినపాకలో 7 ఇళ్లకు గ్రామసభల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. కల్లూరు ఆర్డీవో రాజేందర్‌గౌడ్, డీఈవో సత్యనారాయణ, సీఎంవో రాజశేఖర్, ఆర్ఎండ్బీ ఈఈ ఎం.పవార్ తదితరులు పాల్గొన్నారు.