మధిర, నవంబర్ 1 : లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో వర్షాలతో జలమయమయ్యే కాలనీలు, లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి శనివారం సందర్శించారు. హనుమాన్ కాలనీ, ముస్లిం కాలనీలను కలియతిరుగుతూ వరద ప్రభావ పరిస్థితులను పరిశీలించారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపడానికి టౌన్ మ్యాప్‌లను పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. స్థానికులతో మాట్లాడి.. వర్షంతో వారికి కలిగిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
స్టామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్డు వెడల్పు పెంచాలని, ప్రజలందరూ దీనికి సహకరిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క నిధులు మంజూరు చేస్తారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులతో పట్టణ అభివృద్ధి పనులు, శానిటేషన్, వరద లోతట్టు ప్రాంతాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్షించారు. మధిర పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డుకు తరలించాలని, రహదారుల వెంట చెత్త కనిపించొద్దని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మం, ఆర్అండ్బీ డీఈ శంకర్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.