మామిళ్లగూడెం, సెప్టెంబర్ 20 : ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌వో సిద్దార్థ విక్రమ్‌సింగ్, సంబంధిత అధికారులతో కలిసి డీఎస్ఆర్ కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుక వనరులు, ఇతర గనుల వివరాలకు సంబంధించిన సర్వే రిపోర్టులు తయారు చేయాలని ఆదేశించారు.
ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పత్రికల్లో ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయని, అధికారులు స్పందిం చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కూడా అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి మండలంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీవో శ్రీనివాస్, మైనింగ్ ఏడీ సాయినాథ్, టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి శంకర్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్శాఖ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి సీఎస్ జాతీయ రహదారుల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్సింగ్లతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఎన్‌హెచ్-163జీ పరిధిలో ఖమ్మం జిల్లాలో కోర్టు స్టే ముగిసినందున 12 కిలోమీటర్ల మేరకు రోడ్డు వేసేందుకు 42 హెక్టార్ల భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేసి అక్టోబర్ చివరి నాటికి ఎన్హెచ్ఏకు భూ బదలాయింపు చేస్తామన్నారు. కొదుమూరులో పెండింగ్‌లో ఉన్న 7.39 హెక్టార్ల భూ బదలాయింపు రాబోయే 10రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.