ఖమ్మం రూరల్, ఆగస్టు 16 : ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగుల ఉధృతి పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మున్నేరు సమీప ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం సాయంత్రం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్‌తో మాట్లాడారు.
వరద ఉధృతికి అనుగుణంగా చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. గత ఏడాది ముంపునకు గురైన కాలనీల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట చర్యలు చేపట్టాలని, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎగువ నుంచి వస్తున్న వరద సమాచారం ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
చాలా ప్రదేశాల్లో యువకులు చేపల వేట కొనసాగిస్తున్నారని, ఎట్టి పరిస్థితిల్లోనూ అలాంటి చర్యలు చేపట్టవద్దన్నారు. యువకులు ఎక్కువగా సెల్ఫీలు, ఇన్స్టాగ్రామ్ వీడియోల నిమిత్తం వస్తున్నారని, అలాంటి వారిని వాగు దరిదాపుల్లోకి రాకుండా కట్టుదిట్టం చేయాలని సీఐని ఆదేశించారు. మున్నేరు పరిసర ప్రాంతాల కాలనీవాసులు అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు.