ఖమ్మం, సెప్టెంబర్ 11 : అడవులను నరుకుంటూపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, మనిషి జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్.. సీపీ సునీల్ దత్, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించి, అటవీ-వన్యప్రాణి రక్షణ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022లో భద్రాద్రి కలెక్టర్‌గా ఉన్న సమయంలో అటవీ అధికారి శ్రీనివాస్‌రావు అకాల మరణం చెందారని, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అడవుల సంరక్షణకు నిర్విరామంగా కృషి చేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందిని సైలెంట్ హీరోస్గా కలెక్టర్ అభివర్ణించారు. జిల్లాలోని అటవీ సంపదను కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలో రెండు నెలలకు ఒకసారి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించి.. అటవీ శాఖకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ అటవీ అమరవీరుల త్యాగం మనందరికీ స్ఫూర్తి అని, వారి ఆదర్శాన్ని అనుసరించి ప్రకృతి-వన్యప్రాణులను కాపాడుకోవాలని అన్నారు. అనంతరం అటవీ సిబ్బందికి సంరక్షణ పరికరాలు, రెయిన్ కోట్లు, స్టిక్ గార్డ్స్‌ను కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా మానిటరింగ్, అటవీ రక్షణలో వినియోగించే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కలెక్టర్ సందర్శించారు. సీసీ కెమెరా పనితీరు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అటవీ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.