భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : గోదావరి వరదల నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఇతర అధికారులతో కలిసి గోదావరి వరదల సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
వరదల వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు బోట్లు, నాటుపడవలు, లైఫ్ జాకెట్లు, తాళ్లు, టార్చిలైట్లు, హ్యాండ్మైకులు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలను ముంపు పరిస్థితులు ఏర్పడిన తర్వాత కాకుండా ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
గోదావరి నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద పరిస్థితులపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యుత్, తాగునీరు, వైద్యసేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధితశాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడంతోపాటు మండల, జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ రూములు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.