– అర్హుల జాబితాలో ఉన్న 60 మందిని ఎందుకు తొలగించారు?
– కారణాలు అడిగితే అరెస్టులా?
నల్లగొండ రూరల్, ఆగస్టు 17 : 2023లో లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల్లో సుమారు 60 మందిని తొలగించడంపై కారణాలు అడిగితే పోలీసులతో అరెస్టులు చేయించడం ప్రజా పాలన ఎలా అవుతుందని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ ఈ మేరకు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా పేర్లు తొలగించిన లబ్ధిదారులు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తాసీల్దార్ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించడంతో సోమవారం పలువురు లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. తాసీల్దార్ కార్యాలయంలో లేకపోవడంతో ఆయన వచ్చే వరకు అక్కడే ఉంటామని చెప్పి లబ్ధిదారులతో కలిసి సీపీఎం నాయకులు కార్యాలయంలో బైఠాయించారు. అయితే తాసీల్దార్ కార్యాలయానికి రాకుండానే పోలీసులను పిలిపించి నాయకులను అరెస్టు చేశారని వారు ఆరోపించారు.
నల్లగొండ పట్టణంలో నిర్మించిన 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని సీపీఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. దీంతో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి, 2025 నవంబర్లో అధికారులు మరోసారి విచారణ నిర్వహించి గతంలో లాటరీ ద్వారా ఎంపికైన 421 మంది పూర్తిస్థాయి అర్హులని ప్రకటించారని పేర్కొన్నారు. ఆగస్టు 13న మేయర్, ఆర్డీవో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి గతంలో లాటరీ ద్వారా ఎంపికైన వారికే ఇళ్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, పంపిణీ సమయంలో సుమారు 60 మంది పేర్లు తొలగించడం అన్యాయమని నాయకులు అన్నారు.
లబ్ధిదారుల పేర్లు ఎందుకు తొలగించారో చెప్పకుండా పోలీసులతో అరెస్టులు చేయించడం దుర్మార్గమైన చర్య అని, తాసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయమా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా? అని ప్రశ్నించారు. అధికారులు రాజకీయ కార్యకర్తల్లా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి లాటరీ ద్వారా ఎంపికైన, అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందే వరకు సీపీఎం పోరాటం కొనసాగుతుందని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధన పోరాట కమిటీ సభ్యులు గంజి రాజేష్, పగిల్లా జయమ్మ, మధుసూదన్, రాధ, రహీమున్నీసా బేగం, కాపర్తి ధనమ్మ, పసుపుల సంధ్య, పుట్ట బత్తుల పావని, నల్లబోతు కవిత, గుంటి నాగలక్ష్మి, మేకల కల్పన పాల్గొన్నారు.