భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా తన పేరును నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవా కేంద్రాల మేనేజర్లతో ఆదివారం నిర్వహించిన గూగుల్ మీట్లో ఆయన మాట్లాడారు. ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికీ గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకూ 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెకుట చేపట్టినట్లు చెప్పారు.
భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించబడుతుందని అన్నారు. రెవెన్యూ శాఖ వద్ద భూ రికార్డులను రైతుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుందని, ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం తదుపరి విడుదల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. రాబోయే వానకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోలు యూరియా, ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, లేక సమీప మీ సేవా కేంద్రాలను సంప్రదించి వెంటనే ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.