కొత్తగూడెం గణేశ్టెంపుల్, జూన్ 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగనున్న నీట్(యూజీ) 2026 ప్రవేశ పునః పరీక్షను సజావుగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్రాజుతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్షకు జిల్లాలో మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.
ఇందుకోసం జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి ఉమెన్స్ కళాశాలలో 360, పాల్వంచ టీజీఎస్డబ్ల్యూఆర్ పాఠశాలలో 288, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240, కొత్తగూడెం ప్రభుత్వ రామచంద డిగ్రీ కళాశాలలో 240 మంది పరీక్ష రాయనున్నట్లు వివరించారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ పద్మావతి, ఆర్డీవో మధు, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, తహసీల్దార్లు పుల్లారావు, దారా ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.