భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే గ్రామ, వార్డుసభల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించనున్న గ్రామ, వార్డుసభల ఏర్పాట్లపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలను నాలుగు క్లస్టర్లుగా, మున్సిపాలిటీ పరిధిలోని వార్డులను కూడా క్లస్టర్లుగా విభజించి ప్రణాళికాబద్ధంగా సభలు నిర్వహించాలని సూచించారు.
గ్రామ, వార్డుసభల ద్వారా ప్రజలకు వానకాలం సన్నద్ధత, పారిశుధ్య నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, చెరువులు, జలవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, వాటి సంరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామం, వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించాలని కలెక్టర్ సూచించారు.