కొత్తగూడెం టౌన్, మే 8: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం సుజాతనగర్ పీహెచ్సీ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా పీహెచ్సీని సందర్శించిన కలెక్టర్ అక్కడ పేదలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఔట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ విభాగం, మందుల గది, సిబ్బంది హాజరు నమోదు పత్రాలు, ఔట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి రోజువారీగా నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న నిల్వల వివరాలను పరిశీలించారు. జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీవో భారతి, వైద్యాధికారులు రమేష్, కొనుగోలు కేంద్రం అధికారులు, సిబ్బంది ఉన్నారు.