కొత్తగూడెం సింగరేణి, జూలై 9 : విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాడు విరివిగా సరఫరా అయ్యే బొగ్గు నేడు సింగరేణిలో ఉత్పత్తి తగ్గడంతో ప్లాంట్లకు సరఫరా చేయాల్సిన నాణ్యమైన బొగ్గు అందని దాక్షగానే మిగిలి పోతోంది. పేరుకే సిరుల వేణి సంగరేణి అనే కార్మిక ప్రాంతాలు నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నాయి. ఉన్న బొగ్గుబావులు మూతపడడంతో ఓపెన్‌కాస్టుల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గును ప్రైవేటుపరం చేయడంతో బొగ్గు ఉత్పత్తి అనుకున్న దానికంటే తక్కువ అవుతుంది. దీంతో పవర్ ప్లాంట్లకు ఎప్పటిలాగా సరఫరా చేయలేకపోతోందని పవర్ ప్లాంట్ల వద్ద నిల్వలు చూస్తే అర్థమవుతోంది.
రాష్ట్రంలో యాదాద్రి, భూపాలపల్లితోపాటు భద్రాద్రి జిల్లాలో భద్రాద్రి, కేటీపీఎస్ పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో1180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్లాంట్లకు 1 యూనిట్ ద్వారా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ ప్లాంట్లకు ఒక రోజుకు 12,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఇప్పటి వరకు ఆ ప్లాంట్‌లో 1,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం 9 రోజుల వరకు మాత్రమే సరిపోతుంది. గతంలో దాదాపు 20 రోజులకు సరిపడా నిల్వ ఉండేది. దీనికి కారణం సింగరేణిలో బొగ్గు లేకపోవడమే అని అధికార వర్గాలు చెబుతున్నాయి.పాల్వంచ కేటీపీఎస్‌లో కూడా 5, 6 దశల్లో 1,000 మెగావాట్ల విద్యుత్ మూడు యూనిట్ల ద్వారా ఉత్పత్తి అవుతోంది.
అక్కడ ప్రస్తుతం 73,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో ఉన్న బొగ్గు వారం రోజులకంటే ఎక్కువ రాదు. గతంలో ఇక్కడ 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉండేదని అధికారులు చెబుతున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగితే ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి కూడా జరగకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే కేటీపీఎస్‌లో 7వ స్టేజీలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 8,300 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. కానీ, అక్కడ కూడా 66,771 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. ఇక్కడ బొగ్గు కేవలం వారం రోజులు మాత్రమే సరిపడా ఉంది. ప్రతి రోజూ బొగ్గు వచ్చే పరిస్థితి లేదు. అదే జరిగితే ప్లాంట్ల నుంచి పవర్ ఉత్పత్తికి బ్రేక్ పడనుంది.
తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో ఉండాల్సిన బొగ్గు నిల్వల కంటే చాలా తక్కువగా ఉన్నాయని, ప్రస్తుత వర్షాకాలంలో సింగరేణి ప్రతిరోజూ అవసరమైన బొగ్గు సరఫరా చేయకపోతే విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని జెన్కో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) నివేదికల ప్రకారం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కనీస నిల్వలు 8.54 లక్షల టన్నులు ఉండాలి. కానీ, జూన్ నెలాఖరు వరకు కేవలం అందులో 21 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలోని కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్, కేటీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కేవలం వారం రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సింగరేణి అధికారులు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం లేదని, ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కూడా రవాణా చేయకపోవడం వల్లనే ఈ బొగ్గు కొరత ఏర్పడుతోందని జెన్కో వర్గాలు వెల్లడిస్తున్నాయి. సింగరేణి అధికారులు మాత్రం సింగరేణిలో తక్కువగా ఉత్పత్తి అయ్యే జీ9, జీ10 గ్రేడ్ల బొగ్గు సరఫరా చేయాలని జెన్కో అధికారులు చెబుతున్నారని, కానీ, జీ13, జీ14, జీ15 గ్రేడ్ల బొగ్గు ఉత్పత్తి అవుతోందని, అందువల్లనే జెన్కోకు అవసరమైన నాణ్యమైన, సూటబుల్ గ్రేడ్ బొగ్గును సరఫరా చేయలేకపోతున్నామని సింగరేణి అధికారులు తెలుపుతున్నారు. జెన్కో అధికారులు మాత్రం వారు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకపోవడం వల్లనే సింగరేణి అధికారులు అవసరమైన బొగ్గును సరఫరా చేయడం లేదని సింగరేణిపై దుష్ప్రచారం చేసేందుకు పూనుకున్నట్లు చెబుతున్నారు.
అయితే, రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే బొగ్గు ఉత్పత్తికి, రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, అలాంటి సమయంలో ఆయా పవర్ ప్లాంట్లలో సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవడం విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని జెన్కో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా బొగ్గుబావుల్లో ఉత్పత్తి తగ్గడంతో పవర్ ప్లాంట్లకు సరిపడా బొగ్గును సరఫరా చేయలేకపోవడానికి కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉత్పత్తిలో ఏనాడూ సరిపడా నిల్వలు లేకపోవడం అనేది ఏ ఒక్క మైన్లోనూ కనబడిన సందర్భాలు లేవు. కానీ, గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రం బొగ్గు ఉత్పత్తిలో మాత్రం తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి.
దీంతో భవిష్యత్తులో బొగ్గు సరఫరా జెన్కోలకు కష్టమే అనిపిస్తున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సింగరేణివ్యాప్తంగా రికార్డుల్లో బొగ్గు నిల్వలు ఉన్నట్లు చెబుతున్నా ఆయా ఏరియాల్లో బొగ్గు నిల్వలు అంతగా లేకపోవడం, ఆ విషయం ఇప్పటికే కార్మిక సంఘాల దృష్టికి రావడం, దీనిపై బీఆర్ఎస్ బృందం ఆయా ప్రాంతాలను పర్యటించి పరిశీలించడం వంటి ఘటనలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో థర్మల్ పవర్ ప్రాజెక్టులకు నెలనెలా సరఫరా చేసే బొగ్గు సరఫరా అంతంత మాత్రంగానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, పెరిగిన వర్షాభావంతోపాటు తీవ్ర ఎండల వల్ల విద్యుత్‌కు డిమాండ్ అనుకున్నదానికంటే ఎక్కువ అవసరమైంది. దీంతో రానున్న వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సింగరేణి యాజమాన్యం సరఫరా చేసేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది. కేవలం 58 మిలియన్ టన్నులతోనే సరిపెట్టుకుంది. సింగరేణి సంస్థ తక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి ఎక్కువ ఉత్పత్తి నిల్వలు ఉన్నాయని చూపుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి సరఫరాకు సంబంధించిన వివరాలను యాజమాన్యం వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తెలంగాణలో ఉన్న థర్మల్ పవర్ స్టేషన్లకు విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేకుండా ఆయా కేంద్రాలకు వారు అనుకున్నంత బొగ్గు నిల్వలు ఉంచాల్సి ఉంది. కానీ, సింగరేణి సంస్థ తక్కువ బొగ్గును ఉత్పత్తి చేయడం వల్ల ఏ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా అనుకున్నంత నిల్వలు లేవని, భవిష్యత్తులో ఇదే విధంగా బొగ్గు సరఫరా కొనసాగితే తీవ్ర వర్షప్రభావం ఉంటే విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుందని జెన్కో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని బీటీపీఎస్, కేటీపీఎస్, వైటీపీఎస్, భూపాలపల్లి కేటీపీపీతోపాటు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న జైపూర్ ఎస్టీపీసీలకు మాత్రం రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు సరఫరా చేస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కో పవర్ ప్లాంట్‌కు 15 వేల టన్నుల నుంచి 30 వేల టన్నుల వరకు ప్రతి రోజూ విద్యుత్ ఉత్పత్తికి అవసరానికి అనుగుణంగా బొగ్గును సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది.
రోజువారీ అవసరంతోపాటు ఏదైనా అంతరాయం జరిగితే బొగ్గు ఉత్పత్తి జరగకపోయినా కూడా కనీసం విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఆయా పవర్ ప్లాంట్లలోని కోల్యార్డుల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంటుంది. గత ఏడాది సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించకపోవడంతో ఏ ఒక్క పవర్ ప్లాంట్‌లో కూడా అనుకున్నంత బొగ్గు నిల్వలు లేవని, భవిష్యత్తులో ఇలానే కొనసాగితే సింగరేణి బొగ్గు కొనకుండా బయటి నుంచి బొగ్గును తెప్పించుకునేందుకు పక్క రాష్ర్టాల్లో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేంద్రం కూడా వారికి సహకరిస్తుండడంతో కార్మికుల కష్టానికి యాజమాన్యాలు తూట్లు పొడుస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.