ఖమ్మం, జూలై 10: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరంలో గురువారం పర్యటించారు. తొలుత తన సిఫార్సుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు బుర్హాన్పురంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. తరువాత గురుపౌర్ణమి సందర్భంగా ఖమ్మంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల బాధ్యులు ఆయనను శాలువాలతో సత్కరించారు. అలాగే, గాంధీచౌక్ వద్ద కొలువైన వరప్రదాత షిర్డీసాయి మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలకు ఆలయ కమిటీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త వేములపల్లి వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు వద్దిరాజు హాజరయ్యారు.
దీపారాధనతో పూజలు చేశారు. ఆ తరువాత, ఐఐటీ ర్యాంకర్ ఆదర్శను ఎంపీ వద్దిరాజు ఆశీర్వదించారు. ఖమ్మానికి చెందిన సామాజిక ఉద్యమ నేత లింగాల రవికుమార్ కుమారుడు ఆదర్శ జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకుతో ఐఐటీ చెన్నైలో సీటు పొందాడు. ఈ విద్యార్థిని వద్దిరాజు అభినందించి.. మరింత శ్రద్ధగా చదువుకొని గొప్పస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, పగడాల నరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో కల్తీ కల్లు కారణంగా ఏడుగురు మృత్యువాత పడడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలందించి వారి ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.