కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 15: ఔను.. ఒకే ఒక్కడు.. ఏకంగా 18,500 మొక్కలు నాటారు..! ఇన్ని మొక్కలు నాటారంటే.. ఆయనకు ఇంకేమీ పని లేదేమోనని, ఇదే పనిగా ఎంచుకున్నారేమోనని అనుకుంటే పొరబడినట్లే..!! ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం. మొక్కలు నాటడమంటే ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు.. అదొక బాధ్యతగా భావిస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఈ బాధ్యతను కొనసాగిస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. తెలంగాణ ట్రీ మ్యాన్ అవార్డు గ్రహీత, సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఉన్న బలరాం..!! ఆయన ఆదివారం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పార పట్టుకుని మట్టిని తవ్వి మొక్క నాటారు.
ఆయన ఇక్కడ ఇప్పటివరకూ 208 మొక్కలు నాటారు. ఆదివారం నాటిన మొక్కతో ఈ సంఖ్య 209కి చేరింది. గత కొన్నేళ్ల నుంచి సింగరేణివ్యాప్తంగా ఆయన నాటిన మొక్కల సంఖ్య ఆదివారం ఈ మొక్కతో 18,500కు చేరింది. “పర్యావరణ సమతుల్యతకు ముప్పు ఏర్పడుతున్న పరిస్థితుల్లో.. పర్యావరణ ప్రేమికుడిగా, నా బాధ్యతగా మొక్కలు నాటే పనిని చేపట్టాను. ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో 40చోట్లకు పైగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాను. అవన్నీ చక్కగా పెరుగుతున్నాయి. వీటిలో 35కు పైగా ప్రదేశాలు ఇప్పుడు ‘మినీ ఫారెస్టులు’గా మారాయి..!!!” అని, ఆయన ఆనందం వ్యక్తం చేశారు.