ఖమ్మం, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాకు వరప్రదాయినిగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పలుచోట్ల పంప్‌హౌజ్‌లను ప్రారంభించి వైరాలో ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. అదేవిధంగా వైరా వేదికగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ మూడోవిడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉదయం 11:45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి చేరుకుంటారు.
అక్కడ సీఎం రేవంతరెడ్డి సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌజ్-2ను ప్రారంభించి ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరుకానున్నారు. ములకలపల్లి మండలం కమలాపురం వద్ద ఏర్పాటుచేసిన మరో పంపుహౌజ్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో నిర్మించిన పంప్‌హౌజ్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కడే మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం అక్కడి నుంచి 2:15 గంటలకు రెండు హెలికాఫ్టర్ల ద్వారా నియోజకవర్గ కేంద్రమైన వైరాకు చేరుకుంటారు. అక్కడ రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మూడోవిడత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సందర్భంగా వేదికపైన పలువురు రైతులకు రుణమాఫీకి సంబంధించిన చెక్కులను అందించనున్నారు. అనంతరం కార్యక్రమాలను ముగించుకుని సాయం త్రం 4:45 గంటలకు వైరా నుంచి హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పోలీస్ అధికారులు భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేశారు.