మామిళ్లగూడెం, జూలై 30: జిల్లాలో అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ పథకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటన్నామని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. రెండో విడత రైతు రుణమాఫీని హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించగా ఖమ్మం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని రైతులు, అధికారులు వీక్షించారు.
అనంతరం జిల్లా రైతులు, అధికారులతో ఖమ్మం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రూ.లక్షన్నర వరకు పంట రుణాలు ఉన్న రైతులకు రెండో విడత కింద రుణమాఫీ జరిగినట్లు చెప్పారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలో మొత్తం 91,973 మంది రైతుల రుణాలు మాఫీ అయినట్లు చెప్పారు. మొదటి విడతలో రూ.లక్షలోపు రుణాలున్న 57,857 మంది రైతుల్లో దాదాపు 51 వేలకు పైగా రైతుల ఖాతాలకు రూ.258 కోట్లను జమ చేసినట్లు తెలిపారు.
రెండో విడతలో రూ.లక్షన్నర వరకూ రుణాలున్న 34,116 మంది రైతులకు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. వీటిని వచ్చే వారం రోజుల్లోపు రైతుల రుణ ఖాతాల్లో పూర్తిస్థాయిలో జమచేస్తామన్నారు. ఆ తరువాత రైతుల రుణాలు రెన్యూవల్ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందేలా బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రుణమాఫీపై సమస్యలున్న రైతులు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అనంతరం, జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆవిషరించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు విజయనిర్మల, మురళీధర్‌రావు, శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.