సన్న వడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించింది. తీరా పంట విక్రయించి రెండునెలలు దాటినా డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. ఎప్పుడు పడతాయో కూడా అధికారులు చెప్పడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు బోనస్ వస్తేనన్న పెట్టుబడులు తీరుతాయని రైతన్నలు పెట్టుకున్న ఆశలపై సీఎం రేవంత్‌రెడ్డి నీళ్లు చల్లారు. బోనస్, ధాన్యం డబ్బుల కోసం అన్నదాతలు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరగలేక ఏడుస్తున్నారు. ఈ మాటల ప్రభుత్వాన్ని నమ్మి నిలువునా మోసపోయామని కర్షకులు కోపంతో రగిలిపోతున్నారు.
– నమస్తే నెట్వర్క్
45 రోజులైనా డబ్బులు రాలే..
సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో పంట సాగు చేశాను. కొనుగోలు కేంద్రంలో 150 క్వింటాళ్ల ధాన్యం విక్రయించాను. బోనస్ వస్తే పెట్టుబడులు తీరుతాయనుకుంటే ఇంతవరకు ఖాతాలో బోనస్ జమ కాలేదు. ధాన్యం అమ్మి 45 రోజులకు పైగా కావొస్తున్న బోనస్ మాత్రం రాలేదు. రోజూ బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చూసుకుంటున్నా. ఎప్పుడు బోనస్ డబ్బులు పడతాయో అర్థం కావడం లేదు. అధికారులను అడిగితే వస్తాయిలే అని చెబుతున్నారు. నేను విక్రయించిన ధాన్యానికి బోనస్ డబ్బులు వచ్చేలా చూడాలి.
-వీరబోయిన రాములు, రైతు, మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
ప్రభుత్వంపై నమ్మకం పోయింది..
కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. రైతులు సన్న ధాన్యం పండిస్తే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి నేటి వరకు అందించలేదు. మొదట్లో ధాన్యం విక్రయించిన అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని గొప్పలు చెప్పి సంబురాలు చేశారు. కానీ.. మళ్లీ ఇవ్వలేదు. బోనస్‌కు సంబంధించిన ఒక్క రూపాయి కూడా పడలేదు. ఎవరిని అడగాలో.. ఎవరు సమాధానం చెబుతారో అనేది స్పష్టత లేదు. రైతులకైతే ఈ ప్రభుత్వంపై అస్సలు నమ్మకం లేదు.
-బండి రమేశ్, యువ రైతు, తాళ్లపెంట, పెనుబల్లి మండలం
113 క్వింటాళ్లు అమ్మినా బోనస్ రాలే..
113 క్వింటాళ్ల సన్న ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రెండు నెలలకు పైగా అవుతున్నా ఇప్పటివరకు నా ఖాతాలో డబ్బులు జమ కాలేదు. బోనస్ ఇస్తే వరి సాగు చేసినందుకు గిట్టుబాటు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి పంట వేశాను. అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారే తప్ప ఎప్పుడు వేస్తారని కచ్చితంగా చెప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– లక్ష్మీనర్సమ్మ, మహిళా రైతు, మందలపల్లి, దమ్మపేట మండలం