ఖమ్మం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మూడు విడతల్లో ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్టోబర్ 27న పాలేరు నియోజకవర్గంలో ప్రచారం చేసి.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 5న ఖమ్మం, కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో పలు దఫాలుగా పర్యటించనున్నారు. అక్టోబర్ 27న సీఎం కేసీఆర్.. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి.. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే నవంబర్ 1వ తేదీన మరో విడత ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
నవంబర్ ఒకటో తేదీన సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో పర్యటించి.. బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియానాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. నవంబర్ 5న ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించి.. బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుల విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సీఎం ఎన్నికల ప్రచార పర్యటనపై ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలకు సమాచారం అందడంతో సభ ఏ ప్రాంతంలో నిర్వహించాలి.. సభాస్థలి, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించారు. మూడు విడతల్లో ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. సీఎం పర్యటనపై అధికారులకు సమాచారం అందడంతో హెలిపాడ్, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.