‘కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ప్రజలకు పైసా ప్రయోజనం ఉండదు. భట్టి చుట్టపు చూపుగా వచ్చి నియోజకవర్గాన్ని చూస్తారు. ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. ఆ పార్టీది మోసాల చరిత్ర. బీఆర్ఎస్ గెలిస్తేనే మధిరకు సాగు జలాలు వస్తాయి. దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అమలవుతాయి’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మధిర పట్టణ శివారులో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
ఖమ్మం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ గెలిస్తేనే మధిరకు సాగు జలాలు వస్తాయని, దళితబంధు వంటి సంక్షేమ పథకాలు అమలువుతాయని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మధిరలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో ప్రజలకు పైసా ప్రయోజనం ఉండదని, చుట్టపు చూపుగా వచ్చి నియోజకవర్గాన్ని చూసి వెళ్తారని విమర్శించారు. తానే ముఖ్యమంత్రినవుతానంటూ ప్రజలను ఆయన మభ్యపెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నదని అన్నారు. కానీ ఆ పాలనలో ప్రజలు ఎమర్జెన్సీని ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 20 స్థానాలకు మంచి రావన్నారు.
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామంటూ మధిర ఎమ్మెల్యే భట్టి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో ‘భూమాత’ అనే పోర్టల్‌ను తెస్తామంటున్నారని అన్నారు. ఇదే జరిగితే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు కేవలం మూడు గంటల కరెంట్ ఇస్తే చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని, రైతుబంధు దుబారా అంటూ మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని గుర్తుచేశారు. ‘24 గంటల కరెంట్ కావాలా? మూడు గంటల కరెంట్ కావాలా? రైతుబంధు లేకపోతే ఫర్వాలేదా? ధరణి కావాలా.. వద్దా..?’ అని సీఎం కేసీఆర్ ప్రజలను అడిగారు. వెంటనే ప్రజలు పెద్దఎత్తున ‘రైతుబంధు, ధరణి, 24 గంటల కరెంట్ కావాలి..’ అంటూ నినదించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆషామాషీగా ప్రకటించలేదని, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ తాను పోరాడి, 36 పార్టీలను ఏకం చేసి ఉద్యమిస్తేనే కాంగ్రెస్ పార్టీ స్పందించిందని గుర్తుచేశారు.
మార్చి నెలలో నియోజకవర్గంలో అకాల వర్షం కురిసి పంటలు దెబ్బతిన్నాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. తాను స్వయంగా బోనకల్లు మండలంలో బాధిత రైతులను పరామర్శించామన్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించామన్నారు. అభ్యర్థుల గుణగణాలతోపాటు వారిని బలపరిచే పార్టీల నడవడిక, దృక్పథాన్ని గమనించాలని కోరారు. చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు విని ఓటు వేయవద్దని సూచించారు.
కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కరెంటు కాటుగలుస్తుందని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నగర ప్రాంత ప్రజలకు విద్యుత్ సరఫరా గతంలో ఇప్పటి ఏపీలోని చిల్లకల్లు నుంచి జరిగేదని, విద్యుత్ సరిగా అందక వినియోగదారులు ఇబ్బందిపడేవారని గుర్తుశారు. తాను అక్కడి ఫీడర్‌ను ఖమ్మం జిల్లాకు తెచ్చి సమస్యను పరిష్కరించానని గుర్తుచేశారు. కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోణం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానవతా దృక్పథం ఉంటుందని అన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి పాలేరుకు అనుసంధానం చేస్తామన్నారు. 37 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న సీతమ్మ సాగర్ అందుబాటులోకి వస్తే మధిరకు కరవంటూ ఉండదని అన్నారు. సభకు బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు అధ్యక్షత వహించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణచైతన్య పాల్గొన్నారు.
దళితబంధు పైలట్ ప్రాజెక్టులో భాగంగా చింతకాని మండలాన్ని ఎంపిక చేశామని, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అడిగితేనో, ధర్నా చేస్తేనో, దరఖాస్తు చేస్తేనో ఎంపిక చేయలేదని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించుకుంటే, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన దళిత కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామని మాట ఇచ్చారు.
ఖమ్మం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మధిర, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జన ఉప్పెనను తలపించాయి. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన ఈ సభలకు జనం ప్రభంజనంగా తరలిరావడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. ప్రగతి ప్రధాతను చూసేందుకు ఆయా సభలకు నిర్ణీత సమయానికంటే 2 గంటల ముందే ప్రజలు, అభిమానులు వచ్చి ఓపికగా వేచి చూశారు. సీఎం ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. మధిర సభలో అక్కడి ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తావనను సీఎం తీసుకొచ్చినప్పుడల్లా, వంగ్యాస్ర్తాలు సంధించినప్పుడల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే సాధ్యం కాదని, ఈసారి భట్టివిక్రమార్కను ఓడించి కమల్‌రాజును గెలిపిస్తేనే అది సాధ్యమవుతుందని సీఎం ప్రస్తావించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. దివంగత కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా ప్రజల నుంచి అదే స్పందన లభించింది. వైరా సభలో కూడా ఇదే ప్రస్ఫుటమైంది. ఈ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు తమ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమంటూ మాట్లాడుతున్నారని అన్నారు. అసలు అసెంబ్లీ గేటు దాటనీయకపోవడానికి వారెవరని ప్రశ్నించారు. వీరి కోట్లాది రూపాయల డబ్బు హైదరాబాద్‌లో పట్టుబడిందని ప్రచారం జరుగుతోందని అన్నారు. కానీ కోట్లాది విలువైన ఓటు ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి నోట్ల స్వాములకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు వినిపించారు. వైరా, మధిరల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతా ల అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానని అన్నారు.
మధిర, నవంబర్ 21: సీఎం కేసీఆర్ తనకు రాజకీయ పునర్జన్మనిచ్చారని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అప్పగించి ప్రజలకు సేవచేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు. ఈ పదవి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించానని అన్నారు. ఇంతటి ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సభా వేదిక ద్వారా పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ మూడోసారి కూడా సీఎం అవుతారని స్పష్టంచేశారు. అయితే ఆయన పక్కనే ఎమ్మెల్యేగా కుర్చొనే అవకాశాన్ని మధిర ప్రజలు తనకు కల్పించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి తనకు ఆ అవకాశాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.