ఖమ్మం, నవంబర్ 5: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నగర ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై నీరాజనం పలికారు. ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు నగరవాసులు పోటిపడ్డారు. ఆదివారం ఉదయం నుంచే కేసీఆర్ సభకు వెళ్లేందుకు ఆయా కాలనీవాసులు, వ్యాపారులు, కార్మికులు సంసిద్దులు అయ్యారు. ఆయా డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, యువజన, విద్యార్థి విభాగం, మహిళా విభాగం, ఇతర అనుబంధ సంఘాల బాధ్యులు, కార్పొరేటర్లు, నామినేటేడ్ సభ్యులు వీధుల్లో విస్తృత ప్రచారం చేశారు. దినసరి కూలీలు, వ్యాపారులు, కార్మికులు పనులకు సెలవు పెట్టి మరీ కేసీఆర్ సభకు వచ్చిన తీరు ఆ పార్టీ నాయకుల్లో రెట్టింపు ఉత్సాహన్ని కలిగించింది. నెల రోజులుగా పువ్వాడ అజయ్‌కుమార్, ఆయన సతీమణి చేసిన ప్రచారం ప్రభావం నగరవాసులపై స్పష్టంగా కనిపించింది. తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్దిదారులు కుటుంబసభ్యులతో కలిసి సభకు రావడం విశేషం. కేసీఆర్ చేసిన మేలు, నగర అభివృద్ధికి అజయ్‌కుమార్ చేసిన కృషికి తమ వంతు మద్దతుగా సభకు రావాల్సిన అవసరం ఉన్నదని నగరవాసులు బాహాటంగానే చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ద్వారానే మరింత ప్రయోజనం చేకూరుతుందనే విశ్వాసంతోనే కేసీఆర్ సభకు వచ్చినట్లు నగరవాసులు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ ప్రభావం ఆయా కాలనీలో స్పష్టంగా కనిపించింది. ఏవీధులో చూసినా, ఏ సెంటర్లో చర్చించుకున్నా కేసీఆర్ సభపైనే ముచ్చట్లు. మార్కెట్ కమిటీకి చెందిన కార్మికులు, దడవాయిలు, అడ్తీదారులు, సైతం వారి దినసరి చర్యల్లో పాల్గొనలేదు, వేకువజాము నుంచే తమ పనులను ముగించుకున్న గృహిణులు 12 గంటల నుంచే సభాస్థలికి చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ ఉపన్యాసం దగ్గర ఉండి వినేందుకు గనరవాసులు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. బీఆర్ఎస్ యువజన విభాగం, విద్యార్థి సంఘం బాధ్యులు, ఆయా కళాశాల విద్యార్థులు, పార్టీ అభిమానులు వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సభా స్థలికి చేరుకున్నారు. వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతాల నుంచి ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, పార్టీ బాధ్యులతో కలిసి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకే సభాప్రాంగణం పూర్తిగా నిండిపోయింది.
ఎన్నిల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి.. కాంగ్రెస్ నాయకుల కుట్రలను ఎలా ఎండగట్టాలి.. ఆంధ్ర నాయకుల కుతంత్రాలను ఎలా ఎదుర్కోవాలి.. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి కేసీఆర్ 16 నిమిషాల ప్రసంగంలో కూలంకుషంగా వివరించారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో నూతనోత్తేజం కలిగించినైట్లెంది. పువ్వాడకు ఓటస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని ఆయన భరోసా ఇచ్చారు.
ఖమ్మంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, పాలేరు, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్, మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, అసెంబ్లీ నియోజక వర్గాల సమన్వయ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సుడా డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో సభ ముగించుకుని హెలికాప్టర్లో ఖమ్మం చేరుకున్న సీఎం కేసీఆర్‌కు హెలీ ఫ్యాడ్ వద్ద మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో మంత్రి, ఎంపీలు, ఇతర నాయకులు సభా స్థలి వద్దకు చేరుకోగానే బీఆర్ఎస్ అసెంబ్లీ నియెజకవర్గాల సమన్వయ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.