అందుకోసం శ్రేణులు భారీగా జన సమీకరణ చేయాలి
ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రికి ఎనలేని అభిమానం
అందుకే జిల్లాలో ఇద్దరికి ‘రాజ్యసభ’ అవకాశం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, జూన్ 16: ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘సీఎంకు కృతజ్ఞత’ సభకు భారీ జనసమీకరణ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు జిల్లాపై ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని, అందుకే జిల్లాకు చెందిన ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారని అన్నారు. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డిలు శనివారం జిల్లాకు వస్తున్నందున ఖమ్మం పటేల్ స్టేడియంలో నిర్వహించే కృతజ్ఞత, అభినందన సభకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బైక్ ర్యాలీల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఎవరికి వారు వాహనాలను ఏర్పాటు చేసుకొని సమయానికంటే ముందుగానే సభకు వచ్చేలా చూడాలని సూచించారు. సభను పెద్ద ఎత్తున నిర్వహించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, అభినందనలు తెలపాలని ఆకాంక్షించారు. రెండు జిల్లాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు. సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, జడ్పీ, డీసీసీబీ చైర్మనుల లింగాల కమల్‌రాజు, కురాకుల నాగభూషణం, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఖమ్మానికి నూతన రాజ్యసభ సభ్యులు: తాతా మధు
ఖమ్మంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమతో ఉన్నందునే జిల్లాలో ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డిలు రాజ్యసభకు ఎన్నికయ్యాక ఈ నెల 18న తొలిసారిగా జిల్లాకు వస్తున్నందున ఖమ్మం పటేల్ స్టేడియంలో ‘సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత’ సభను నిర్వహించన్నట్లు చెప్పారు. నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18న జరిగే ‘కృతజ్ఞత సభ’కు ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు నూతన రాజ్యసభ సభ్యులకు జిల్లా సరిహద్దున ఉన్న నాయకన్‌గూడెం వద్ద ఘన స్వాగతం పలుకనున్నట్లు చెప్పారు. 3:10 గంటలకు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి ర్యాలీగా బయలుదేరి కాల్వొడ్డు, వైరా రోడ్డు మీదుగా పటేల్ స్టేడియానికి చేరుకుంటామని తెలిపారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషించబోతున్నారని, ఆయనకు అండగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు ఉండడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.