ఎస్సీలు దశాబ్దాల పాటు కటిక పేదరికాన్ని అనుభవించారు.. సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు.. కూలీలుగా, గుమస్తాలుగా పనిచేశారు..చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకున్నారు.. గత ప్రభుత్వాలు కంటితుడుపుగా అరకొర రుణాలు ఇచ్చి, ఒకటో అరో సంక్షేమ పథకాలు అమలు చేసి చేతులు దులుపుకొన్నాయే తప్ప వారి బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి ఎలాంటి ప్రోత్సాహమూ ఇవ్వలేదు.. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేస్తున్నారు.. తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాలను ఎంపిక చేశారు.. దీనిలో భాగంగా చింతకాని మండలం ఎంపికైంది.. సర్కారు మండలవ్యాప్తంగా 3,600 కుటుంబాలకు పైగా అర్హులను గుర్తించింది.. ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేసింది.. అధికారులు నిరంతరం యూనిట్లను పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందిస్తూ ఎస్సీల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. ఎస్సీల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.. ఈ పథకం ఎస్సీల ఆత్మగౌరవ పతాక ఆర్థికాభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది.
ఖమ్మం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు నిస్తూ ప్రతిష్ఠాత్మకంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు తమ ఆసక్తి ఉన్న రంగాల్లో రూ.10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేస్తున్నారు. దీనిలో భాగంగా తొలుత ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారు. పథకంలో భాగంగా మండలవ్యాప్తంగా సుమారు 3,600 వేల మందికి పైగా లబ్ధిదారులకు యూనిట్లు అందించేందుకు యంత్రాంగం ప్రణాళికలు రచించింది. మంత్రి అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులతో అనేకసార్లు సమావేశమై మండలంలోని ప్రతి గ్రామానికి జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారులకు అండగా నిలిచి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించారు. పథకంలో భాగంగా లబ్ధిదారులు హార్వెస్టర్లు, స్ప్రే డోన్లు, ఎక్స్ రే యూనిట్, బుక్‌స్టాల్, కిరాణ షాపు, పాడిపరిశ్రమ, ఫొటో స్టుడియోతో పాటు ఇతర యూనిట్లను నెలకొల్పారు. పథకం తమ జీవితాలను మార్చివేసిందని, కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఉపయోగపడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కూలీలుగా, గుమాస్తాలుగా, డ్రైవర్లుగా బతికిన తమను ఆత్మగౌరవంతో సొంత యూనిట్లు నడుపుకొనేలా చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
దళితబంధు అమలుకు సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్ట్‌గా చింతకాని మండలాన్ని ఎంపిక చేశారు. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించి అనేకసార్లు సమీక్షలు నిర్వహించాం. యూనిట్లు నెలకొల్పి వేలాది మంది ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపాం. లబ్ధిదారులు ఇప్పుడు సొంతంగా యూనిట్లను నడుపుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మండలానికి ఇప్పుడు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. పైలట్ మండలాలుగా ఎంపికైన మండలాల్లో చింతకాని మండలంలోనే అత్యధిక మందికి యూనిట్లు అందాయి. ఇది అద్భుతమైన విజయం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నేను గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో చాలీచాలని జీతంతో డీజిల్ మెకానిక్‌గా పని చేశాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి సొంత జిల్లాలో ఎదగాలని ఉండేది. ఆ కలను దళితబంధు నెరవేర్చింది. పథకంలో భాగంగా మా కుటుంబానికి యూనిట్ మంజూరైంది. పథకం ద్వారా నేను, నాన్న కలిసి రూ.20 లక్షలతో ఖమ్మంలో డీజిల్ మెకానిక్ షాప్ ఏర్పాటు చేశాం. యూనిట్‌ను నెలకొల్పేందుకు అధికారులు ఎంతో సహకరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడారు. డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించడంతో నేను డీజిల్ మెకానిక్ షాపును ఎంచుకున్నాను. యూనిట్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను రూ.40 వేల వరకు మిగులుతున్నాయి. దళితబంధు మా కుటుంబంలో వెలుగులు నింపుతుంది.
– కొండూరి నాగరాజు, దళితబంధు లబ్ధిదారు, కోమట్లగూడెం, చింతకాని మండలం
నేను గతంలో దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దళితబంధు పథకంలో భాగంగా నాకు పురుగు మందు స్ప్రే డ్రోన్ యూనిట్ మంజూరైంది. వ్యవసాయ సీజన్లలో స్ప్రే డ్రోన్‌కు మంచి డిమాండ్ ఉంటున్నది. నేను సీజన్లో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నాను. తక్కువ సమయంలో డ్రోన్ ద్వారా పురుగుల మందు స్ప్రే చేస్తున్నాను. ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాను. రైతులు డ్రోన్‌ను వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు.
– చేపలమడుగు సైదులు, దళితబంధు లబ్ధిదారు, తిరుమలాపురం
పైలట్ మండలంగా ఎంపికైన చింతకాని మండలంలో విజయవంతంగా దళితబంధు పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు మండలానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. లబ్ధిదారులు తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని సూచించాం. మూస పద్ధతులు, మూస యూనిట్ల స్థానంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను నెలకొల్పాలని ప్రోత్సహించాం. అధికారులు ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు సలహాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించారు. యంత్రాంగం లబ్ధిదారుల కోసం ఎన్నో రకాల ఉపాధి మార్గాలను అన్వేషించింది. ప్రతి గ్రామాన్ని ఒక జిల్లాస్థాయి అధికారి ప్రత్యేకాధికారిగా యూనిట్లను పర్యవేక్షించారు. దళిత బంధు పథకం ఎస్సీల జీవితాలను మార్చివేసింది. వారు ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇచ్చింది.
– వీపీ గౌతమ్, ఖమ్మం కలెక్టర్
దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. యూనిట్లను పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పథకంలో భాగంగా ఎంతోమంది హార్వెస్టర్లు, డ్రోన్లు, అంబులెన్సులు, ఎక్స్‌రే యూనిట్లు, గన్నీ బ్యాగ్‌ల తయారీ యూనిట్లను నెలకొల్పారు. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా యూనిట్లను ఎంచుకున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక చొరవ తీసుకుని పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు.
– ఏలూరి శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
మా సొంతూరు మత్కేపల్లి. దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబానికి యూనిట్ మంజూరైంది. పథకం ద్వారా నేను ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో టైలరింగ్, బోటిక్, ఎంబ్రాయిడరీ యూనిట్ నెలకొల్పాను. అన్ని ఖర్చులు పోను నాకు నెలకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తున్నది. గతంలో నేను టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చే దానిని. వస్ర్తాలు కుట్టి అరకొర సంపాదించే దానిని. వచ్చే డబ్బు కుటుంబ ఆవసరాలకు సరిపోయేది కాదు. దళితబంధు పథకం మా కుటుంబాన్ని ఆదుకున్నది. సీఎం కేసీఆర్ మా కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నది.
– స్వాతి, దళితబంధు లబ్ధిదారు, మత్కేపల్లి, చింతకాని మండలం
దళితబంధు పథకంలో భాగంగా మా కుటుంబానికి యూనిట్ మంజూరైంది. మేము ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో అంబులెన్స్ కొనుగోలు చేశాము. ఒకప్పుడు నేను ఒకరి కింద అంబులెన్స్ నడిపేవాడిని. కేవలం నెలకు రూ.15 వేలు మాత్రమే ఆదాయం వచ్చేది. ఇప్పుడు నేను సొంత అంబులెన్స్ నడుపుతూ నెలకు సుమారు రూ.50 వేల వరకు సంపాదించగలుగుతున్నాను. అన్ని ఖర్చులు పోను కనీసం రూ.30 వేలు మిగులుతున్నాయి. దానిలో సింహభాగాన్ని పొదుపు చేస్తున్నాను. అంబులెన్స్ ద్వారా ఉపాధి పొందుతూనే మరోవైపు అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నాను. నిరుపేదలైతే కొన్నిసార్లు వారి నుంచి తక్కువ డబ్బు తీసుకుంటున్నాను. మరికొన్నిసార్లు అసలు డబ్బు తీసుకోకుండానే సేవలు అందిస్తున్నాను. ఈ వృత్తి నాకెంతో సంతృప్తినిస్తున్నది. మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళితబంధు ఎంతో ఉపయోగపడింది.
– కనకపూడి సునీల్, లబ్ధిదారు, నేరడ, చింతకాని మండలం