కారేపల్లి, జనవరి 30 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్- 2026 క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్ బాల్, యోగా, అథ్లెటిక్స్ పోటీలను ఎంఈఓ జయరాజుతో కలిసి తాసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఐ బైరు గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు యూనిఫామ్, క్రీడా సామగ్రి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలను కేవలం పోటీలుగా కాకుండా, ఆరోగ్యకరమైన జీవన విధానంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, జట్టు భావన పెంపొందుతాయన్నారు.
విద్యతో పాటు క్రీడలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. క్లస్టర్ స్థాయిలో ప్రతిభ కనబరిచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. తమ శాఖల తరఫున క్రీడా సౌకర్యాల మెరుగుదలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి జడ్పీఎస్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్యామ్, కేజీబీవీ ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య, పీఈటీలు సిహెచ్.కృష్ణయ్య, సరస్వతి, మోస, బాబు, అనంత్ అనూష, సీతారాం, రామారావు పాల్గొన్నారు.