నమస్తే, నెట్వర్క్ ;క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అన్ని క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ప్రతిష్ఠాత్మక సీఎం కప్ క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం మండలాల్లో జరుగుతున్న క్రీడా పోటీలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రీడాకారులతో ఆడి వారిని ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. వారి కోసం శిక్షణ కేంద్రాలను, క్రీడా ప్రాంగణాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు. కరకగూడెం మండలం తాటిగూడెంలో ఏర్పాటు చేసిన క్రీడలను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు వారితో ఆడి వారిని ఉత్సాహ పరిచారు. దమ్మపేట మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడా పోటీలను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. వాలీబాల్ క్రీడలో పాల్గొని కొద్దిసేపు సర్వీస్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో, పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీఎం కప్ పోటీలను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ విజేతలకు వైరా ఎమ్మెల్యే రాములునాయక్ బహుమతులు అందజేశారు.