ఖమ్మం, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు, పీజీ కళాశాలలు సోమవారం బంద్ పాటించాయి. రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ కళాశాలల యాజమాన్యాలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో బంద్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. సుమారు రూ.150 కోట్ల మేర బోధనా రుసుములు బకాయి కింద ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలకు రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నాయి తప్ప నిధులు రావట్లేదు. ఎప్పుడిస్తారో కూడా తెలియడం లేదు.
దీంతో చేతిలో నిధులు లేకపోవడంతో కళాశాలల నిర్వహణ వాటి యాజమాన్యాలకు భారంగా మారింది. రీయింబర్స్మెంట్ విడుదలపై ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక స్పందించిన పాపానపోలేదు. కొత్త విద్యాసంవత్సరంలో నిధులు విడుదల చేస్తారులే అని నెట్టుకొస్తున్నా.. కనీసం కనికరమూ చూపడం లేదు. దీంతో కళాశాలలను తాము నడపలేమంటూ వాటి యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ విద్యాసంస్థలు బంద్‌కు పిలుపునివ్వగా.. మిగిలిన విద్యాసంస్థలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో సుమారు 40కిపైగా డిగ్రీ కళాశాలలున్నాయి. గతంలో 100కు పైగా డిగ్రీ కళాశాలలు ఉండేవి. ఒకవైపు డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం, మరోవైపు నిర్వహణ భారాలు మోపవుతుండడం వంటి కారణాలతో కళాశాలలు క్రమంగా మూతపడుతూ వస్తున్నాయి. జిల్లాలో ఇంటర్లో 20 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుండగా.. 7 నుంచి 8 వేల మంది ఇంజినీరింగ్ వైపు వెళ్తున్నారు. మరో పది వేల మంది డిగ్రీలో చేరుతున్నారు. అలాగే, డిగ్రీకి అనుబంధంగా మరో పదిహేను వరకు పీజీ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు మూడు వేల మంది వరకు విద్యనభ్యసిస్తున్నారు.
డిగ్రీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కోర్సులను బట్టి రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకూ ఫీజులుంటాయి. ఎక్కువ శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వమే రుసుములు చెల్లిస్తున్నది. నేరుగా ఆయా కళాశాలల ఖాతాల్లోకే బోధనా రుసుముల కింద నిధులు జమచేయాల్సి ఉంటుంది. అయితే, ఎప్పటికప్పుడు ప్రభుత్వం వీటిని చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకే సుమారు రూ.150 కోట్లు రావాల్సి ఉందని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. నిరుడు డిగ్రీలో చేరిన విద్యార్థులకు సంబంధించిన రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. మిగిలిన రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు కూడా చెల్లింపులు జరగలేదు. రూ.కోట్లాది నిధులు ఆగిపోవడంతో కళాశాలల నిర్వహణ తమకు చాలా కష్టంగా ఉంటున్నదని యాజమాన్యాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలల్లో ఆధునిక వసతులు కల్పించాలి. నిపుణులైన అధ్యాపకులను నియమించాలి. అయితే, తమకున్న పరిధిలో వీటన్నింటినీ సమకూర్చేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మరీ ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చాయి. కానీ ఇప్పటికీ రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఆయా యాజమాన్యాలు బ్యాంకులకు వడ్డీ కూడా చెల్లించలేకపోతున్నాయి. ఏడాదికిపైగా అద్దెలు కట్టలేక, అధ్యాపకులు వేతనాలు చెల్లించలేక సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి.
దసరా సెలవుల అనంతరం డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సోమవారం ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు తెరుచుకోలేదు. కళాశాలల బంద్ పాటిస్తున్నట్లు విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. రీయింబర్స్మెంట్ చెల్లించని కారణంగా బంద్‌కి పిలుపునిచ్చినట్లు అన్ని కళాశాలల ఎదుట ఫ్లెక్సీలు ప్రదర్శించారు. జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు మంగళవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి.
తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు. కానీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు చెల్లించాల్సిన రీయింబర్స్మెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుంది.
-గుండాల కృష్ణ, ఆర్జేసీ డిగ్రీ, పీజీ కాలేజీ కరస్పాండెంట్
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. రీయింబర్స్‌మెంట్‌పై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదు. నాయకులు, అధికారులకు సమస్య తీవ్రతను వివరించాం. బంద్ అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.
-మద్ది ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి