అశ్వారావుపేట, నవంబర్ 10: భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కనీసం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు. సరైన తాగునీటి వసతి లేక ఏజెన్సీవాసులు అల్లాడేవారు. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది పోడు చేసుకునేవారే. పేరుకు వారికి భూమి ఉండేది కానీ ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయమూ అందేది కాదు. నాటి ప్రభుత్వాలు పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో తరచూ ఏదో చోట అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మధ్య ఘర్షణలు జరిగేవి. ఇదీ నాటి అశ్వారావుపేట నియోజకవర్గ ముఖచిత్రం. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవన స్థితిగతులు మారాయి.

ఆసరా పథకం ద్వారా ప్రతి నెలా నియోజకవర్గ వ్యాప్తంగా 25,180 మంది దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, కిడ్నీ బాధితుల ఖాతాల్లో రూ.5.45 కోట్లు జమ అవుతున్నది. నియోజకవర్గవ్యాప్తంగా రూ.61.95 కోట్లతో సీసీ రోడ్లు, రూ.7.92 కోట్లతో వైకుంఠధామాలు, రూ.1.37 కోట్లతో అంగన్వాడీ భవనాలు, రూ.9.90 కోట్లతో పంచాయతీలకు పక్కా భవనాలు, రూ.8 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు, రూ.5 కోట్లతో దేవాలయాలు, రూ.5.87 కోట్లతో గురుకులాల్లో ల్యాబ్‌లు, అదనపు గదులు, రూ.22 కోట్లతో చెక్‌డ్యాంలు, రూ.44 లక్షలతో కమ్యూనిటీ హల్స్, రూ.6 కోట్లతో ఆశ్రమ పాఠశాలల్లో డార్మెంటరీలు, రూ.52 కోట్లతో గండుగులపల్లి, ములకలపల్లిలో ఏకలవ్య పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి. సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధితులకు రూ.5 కోట్ల సాయం అందింది. నియోజకవర్గవ్యాప్తంగా 25,957 మంది గిరిజనులకు పోడు పట్టాలు అందాయి.

వాహనదారులకు సేవలు అందించేందుకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషితో ఇటీవల అశ్వారావుపేట పట్టణానికి ఆర్టీఏ సబ్యూనిట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వాహనదారులు స్థానికంగానే వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. అలాగే నియోజకవర్గ పరిధిలోని పెదవాగు ప్రాజెక్టు సమీపంలో మహిళా డిగ్రీ కళాశాల అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కళాశాలలో 520 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రైతులు పండించిన దిగుబడిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం నియోజకవర్గవ్యాప్తంగా రూ.9 కోట్లతో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 4 గోడౌన్లు నిర్మించింది. నియోజకవర్గ అభివృద్ధికి ఐటీడీఏ రూ.64.92 కోట్లతో 231 పనులు చేపట్టి పూర్తి చేసింది. వీటిలో భవనాలు, బీటీ రహదారులు, సబ్ సెంటర్లు, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ప్రజలు అతితక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు సర్కార్ 2019లో రూ.1.10 కోట్లతో గిరిజన కమ్యూనిటీ భవన్ నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది.

దళితబంధు పథకం ద్వారా నియోజకవర్గవ్యాప్తంగా 100 మంది కుటుంబాలు లబ్ధి పొందాయి. ఒక్కో కుటుంబం రూ.10 యూనిట్లు నెలకొల్పి ఆర్థికంగా ఎదుగుతున్నాయి. ఎక్కువ మంది లబ్ధిదారులు ట్రాక్టర్, కార్, ఆటో యూనిట్లు తీసుకున్నారు. మరికొందరు పౌల్ట్రీ, మినీ డెయిరీలు ఏర్పాటు చేసకున్నారు.
రైతుబంధు ద్వారా ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటివరకు 10 విడతల్లో అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా వేలాది మంది ఖాతాల్లో రూ.653.36 కోట్లు జమయ్యాయి. సొమ్ము అందుకున్న రైతులు గుండెపై చేయిచేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు .
ఏవరైనా రైతు ఏ కారణంతో మృతిచెందినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘రైతుబీమా’ పథకాన్ని అమలు చేస్తున్నది. పట్టా పుస్తకం ఉన్న ప్రతిఒక్కరూ బీమాకు అర్హులే. సర్కారే స్వయంగా ప్రీమియం చెల్లిస్తూ రైతు కుటుంబాలకు భరోసా ఇస్తున్నది. నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు 872 మంది రైతులు మృతిచెందగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.43.60 కోట్ల పరిహారం అందింది.
వ్యవసాయశాఖ ప్రకారం నియోజకవర్గవ్యాప్తంగా 17 క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలోని రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ సమాచారం తెలుసుకునేందుకు, అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3.83 కోట్ల నిధులతో 17 రైతువేదికలు నిర్మించింది. ఒక్కో రైతువేదిక నిర్వహణకు నెలకు రూ.9 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నది.
నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సర్కార్ రూ.466.3 కోట్ల నిధులతో 251.25 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించింది. దీని ద్వారా 365 ఆవాస గ్రామాల పరిధిలోని 54,173 ఇండ్లకు శుద్ధజలం అందుతున్నది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులూ ఇప్పుడు మిషన్ భగీరథ నీరే తాగుతున్నారు.
నియోజకవర్గ పరిధిలో సర్కార్ రెండు విడతల్లో 1,380 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించింది. నిర్మాణానికి రూ.74.55 కోట్లు వెచ్చించింది. మొదటి విడతలో రూ.25.15 కోట్లతో 400 ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించింది. రెండో విడతలో 980 ఇండ్లు మంజూరు చేసి, వీటిలో 540 ఇంండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించింది.
సర్కార్ 2019లో అశ్వారావుపేటలో సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు, ప్రజలకు దూరాభారం వెళ్లే వ్యయప్రయాసలు తప్పాయి. గతంలో ఈ సేవలు పొందేందుకు ఉద్యోగులు ఖమ్మం జిల్లా పరిధిలోని సత్తుపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది.
నియోజవర్గ ప్రజలు న్యాయ సేవలు పొందేందుకు ప్రభుత్వం దమ్మపేటలో కోర్టు ఏర్పాటు చేస్తుంది. మండల కేంద్రంలోని పాత ఎస్సీ హస్టల్ భవనాన్ని జిల్లా న్యాయస్థానం కోర్టుగా మార్చింది. గతంలో ప్రజలు న్యాయసేవల కోసం ప్రజలు 100 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడా బాధలు తప్పాయి.
నియోజవర్గ పరిధిలో సెంట్రల్ లైటింగ్‌తో పాటు డ్రైనేజీ, డివైడర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.39.25 కోట్లు వెచ్చించింది. దమ్మపేట మండలం మందలపల్లి, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లోనూ సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల నిర్మాణానికి ఇటీవల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా రూ.15.75 కోట్లు మంజూరు కానున్నాయి.
ఆయిల్‌పాం హబ్ అయిన అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆయిల్ పాం రైతుల సౌకర్యార్థం సర్కార్ రెండు పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మించింది. దీంతో నియోజకవర్గంలో ఆయిల్‌పాం సాగు మరింత విస్తరించింది. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకుని రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారు.
మన ఊరు మన బడి పథకంలో భాగంగా మొదటి విడతలో నియోజకవర్గవ్యాప్తంగా 86 పాఠశాలలు ఎంపికయ్యాయి. సర్కార్ పాఠశాలల అభివృద్ధికి రూ.21.34 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు పూర్తయిన పాఠశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
గిరిజన ప్రాంతంలో నిరుపేదంలందరికీ సర్కార్ వైద్యం అందాలని అశ్వారావుపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆసుపత్రి పరిధిలో డయాలసిస్ సెంటర్, బ్లాడ్ బ్యాంక్‌నూ ఏర్పాటు చేసింది.