ప్రతి మానవుడు తప్పనిసరిగా, అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అంశం దేవుడు. ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన సంగతి సైతం దేవుడే. ఇంతకీ దేవుడు ఎక్కడుంటాడు.. ఎలా ఉంటాడు.. ఆయన గుణగుణాలు ఏమిటీ.. ఇలా ఎన్నో ఏళ్లుగా మనిషి అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. కానీ.. ఎవరు కూడా దేవున్ని సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు.. వర్ణించలేకనూపోయారు. అందుకే ఆ అదృశ్య దేవుని దృశ్యరూపమైన క్రీస్తునాధుడే పరము నుంచి భువికి దిగొచ్చాడు. ముందుగా ప్రవక్తలచేత చెప్పిన విధంగానే కన్య మరియ గర్భాన జన్మించాడు. ఈ లోకమంతటికీ దేవుని శక్తిని, ఆయన లక్షణాలన్నింటినీ తెలియజేశాడు. పాపాలు చేసి దేవుడికి దూరమైన మానవజాతిని మళ్లీ దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టేందుకు తన ప్రాణాన్ని సిలువలో పణంగా పెట్టాడు. మనిషికి, దేవుడికి మధ్య వారధిగా మారిన దైవరూపమే యేసుక్రీస్తు. ఆ క్రీస్తు జననమే క్రిస్మస్.
– ఖమ్మం, డిసెంబర్ 24
కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని బుధవారం ఘనంగా జరుపుకునేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రైస్తవుల పండుగల్లో ప్రధానమైనది యేసుక్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీన జరుపుకునే క్రిస్మస్ పండుగ. నవంబర్ 25 నుంచే సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల షాపింగ్‌ల సందడి ముగిసింది. పండుగ వారంరోజుల ముందు నుంచే ఖమ్మం నగరంలో సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల కోసం కేక్‌లు, స్వీట్లు ఆర్డర్ ఇచ్చేందుకు స్వీటు షాపులు కిటకిటలాడాయి. క్రైస్తవుల ఇళ్లపైన నక్షత్రం ఆకారంలో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు. అంతటా క్రిస్మస్ ట్రీలు, బెల్స్, బెలూన్లు, స్టార్లు, శాంతాక్లాజ్ స్టిక్కర్లు, పండుగ శుభాకాంక్షలు తెలిపే బోర్డులు, పశువుల పాకలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
నెలలు నిండిన కన్య మరియమ్మను ఏసోబు తన సొంత గ్రామమైన బేత్తెహాముకు తీసుకుని వెళ్తారు. కానీ.. వారికి ఆగ్రామంలో ఎక్కడా చోటు లభించదు. చివరికి ఒక పశువుల పాకలో తలదాచుకోవడానికి చోటు లభిస్తుంది. అప్పటికే నొప్పులు పడుతున్న మరియమ్మ చిన్నారి యేసుకు జన్మనిస్తుంది. ఆ బాల ఏసును పొత్తి గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో ఉంచుతారు. దేవుడు భూమిపై జన్మించాలనుకుంటే ఏ రాజు కోటలోనో, ధనవంతుల ఇళ్లల్లో జన్మించి ఉండవచ్చు. కానీ.. తాను సామాన్య మానవుల కోసం లోకానికి వచ్చాననే సందేశాన్ని ఇవ్వడానికి పశువుల పాకలో క్రీస్తు జన్మించాడని క్రైస్తవుల విశ్వాసం.
మన దేశంలోని క్రిస్మస్ తాతనే పాశ్చాత్య దేశాల్లో శాంతాక్లాజ్‌గా పిలుస్తారు. క్రిస్మస్ తాత సంప్రదాయం మూడో శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రిస్మస్కు ముందు రోజు రాత్రి క్రిస్మస్ తాత ఇంటింటికీ వెళ్లి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపుకొట్టి వెళ్లి పోయేవాడని పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం ఉంది.
గడియారాలు లేని రోజుల్లో చర్చిల్లో సమయానుసారంగా మోగించే గంటలే ఊరంతటికీ సమయమెంతో తెలిపేవి. ముఖ్యంగా చర్చిలో ప్రార్థనలు, ఆరాధనల వేళల్లో గంటలు మోగగానే అందరూ హాజరయ్యేవారు. ప్రభువు సన్నిధికి తాము వెళ్లే సమయాన్ని సూచిస్తున్నందున గంటకు ప్రత్యేకత ఏర్పడింది.
జిల్లాలో రోమ్ క్యాథలిక్ మిషన్(ఆర్సీఎం)కు చెందిన పలు చర్చిల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ ఆరాధనలను ప్రారంభించారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి, నాయుడుపేట, ఖమ్మం నగరంలోని వైరారోడ్డు, శ్రీనివాసనగర్, మౌంట్ఫోర్టు, తల్లాడ, కల్లూరు, పాల్వంచ, కొత్తగూడెంలలోని ఆర్సీఎం చర్చిల్లో, భద్రాచంలోని సెయింట్ ఆన్స్ ఆర్సీఎం చర్చిల్లో రాత్రి 11 గంటల నుంచే క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభించారు. ప్రొటాస్టేన్స్ చర్చిలైన సెయింట్ మేరిస్, సీఎస్ఐ చర్చి, ఎన్ఎస్పీ క్యాంపులోని హోలీ ట్రీనిటీ చర్చి, ఇందిరానగర్‌లోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చి, ఖానాపురం హవేలీలోని లివర్స్ చర్చి, కూసుమంచిలోని ఇమ్మాన్యూయేల్ చర్చి, కొత్తగూడెంలోని ఆండ్రూస్ చర్చి, భద్రాచలంలోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చి, పాల్వంచ, ఇల్లెందు, వైరా, రుద్రంపూర్, రామవరం, సత్తుపల్లిలోని సీఎస్ఐ చర్చిల్లో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్రిస్మస్ ఆరాధనలను నిర్వహించనున్నారు.