భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం మార్కెట్ ఏర్పాటు చేసి ఇప్పటికే 40 ఏళ్లు దాటింది. కొన్నిరకాల పంటలు తప్ప ఇక్కడ పత్తి, మిర్చి కొనుగోళ్లకు అవకాశం లేకపోయింది. గతంలో అడపాదడపా పలు రకాల పంటల విక్రయాలు జరిగినా పెద్దగా ప్రయోజనాలు ఒనగూరలేదు. తర్వాత రైతులు యథావిధిగా వ్యయప్రయాసలకోర్చి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లకు పంటలు తరలించేవారు. వేలాది రూపాయలు రవాణాకు వెచ్చించేవారు. ఇప్పుడు రైతుల కష్టాలకు పరిష్కారం దొరికింది. కలెక్టర్ అనుదీప్, మార్కెటింగ్‌శాఖ అధికారులు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు చొరవ తీసుకుని కొత్తగూడెం మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లకు లైన్ క్లియర్ చేశారు. వచ్చే ఏడాది నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. శనివారం మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం కాగా మిర్చి క్వింటా ధర రూ.18 వేలు పలికింది. ట్రేడర్లు జెండా పాట బట్టి, పంట నాణ్యతను బట్టి మిర్చి కొనుగోలు చేశారు.
ఇప్పటికే మార్కెట్‌యార్డులో మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. త్వరలో మార్కెట్లో ఈనామ్ పద్ధతి అమలుకానున్నది. ప్రస్తుతం మార్కెట్ పరిధిలో స్టేట్ ట్రేడర్స్ నలుగురు అందుబాటులో ఉండగా ఖమ్మం నుంచి మరికొందరు వచ్చే అవకాశం ఉంది. ఈ నామ్ పద్ధతి అమలులోకి వస్తే పంటలు కొనుగోళ్లు మరింత సులభతరమవుతుంది. ట్రేడర్స్ ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో టెండర్ వేసి పంటలు కొనే వెసులుబాటు వస్తుంది.
నిన్నమొన్నటి వరకు రైతులు తాము పండించిన పంటలను ఖమ్మం, వరంగల్‌లోని వ్యవసాయ మార్కెట్లకు తరలించేవారు. సరుకును మార్కెట్లకు తరలించడానికి వ్యయప్రయాసలకు గురయ్యేవారు. అలాంటి అవస్థలకు తావు లేకుండా ఈ ప్రాంతంలోని మార్కెట్లలోనే విక్రయాలు ప్రారంభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దూరభారం తగ్గడంతో రైతులు తమకు అనుకూలమైన ప్రాంతం, నచ్చిన ధర ఉన్న చోట్ల పంటను విక్రయించే అవకాశం వచ్చింది.
మారుమూల ప్రాంతాల్లో పంటలు పండించే మాకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేదు. చర్ల నుంచి ఖమ్మం నగరానికి రవాణా చేయాల్సిందే. వందల కిలోమీటర్లు సరుకును తీసుకెళ్లిన తర్వాత తీరా అక్కడ సరైన రేటు రాకపోతే తిరిగి ఇంటికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందుబాటు ప్రాంతంలో విక్రయాలు ప్రారంభించడంతో మా బాధలు తప్పాయి. అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాంత రైతులకు ఇది కలిసొచ్చే అంశం.
-ఎడారి ముత్తయ్య, ఆర్.కొత్తగూడెం,చర్ల మండలం
ఎంతమంది రైతులు ఎన్ని పంటలు సాగు చేసినా మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. కొత్తగూడెంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం రైతులకు వరం. అన్ని పంటలు ఒకేచోట విక్రయించే అవకాశం ఉంటే మంచిదే కదా. గతంలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు దళారులను నమ్మి మోసపోయేవారు. ఇక అలాంటి సమస్యలు ఉండవు. కలెక్టర్ అనుదీప్ మంచి నిర్ణయం తీసుకున్నారు.
-కుర్రా శ్రీను, కోమటిపల్లి, సుజాతనగర్ మండలం
కలెక్టర్ అనుదీప్ ఆలోచనతోనే ట్రేడర్స్‌ను పిలిచాం. ఇందుకు మార్కెటింగ్ కమిటీ సహకారం ఉంది. దీంతో మిర్చి మార్కెటింగ్ సులభతరమైంది. త్వరలో ఈ నామ్ అందుబాటులోకి తెస్తాం. ఇది అమలులోకి వస్తే రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్‌శాఖ భరోసా ఉంటుంది. రైతులు ఎక్కడా నష్టపోకుండా చూస్తాం.
– ఎంఏ ఆలీం,జిల్లా మార్కెటింగ్ అధికారి, కొత్తగూడెం
రైతుల కష్టాలు తెలిసిన వారిగా వారి సమస్యలకు పరిష్కారం ఆలోచించాం. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాము. సానుకూల స్పందన వచ్చింది. రానున్న రోజుల్లో అన్ని పంటలను కొనుగోళ్లకు ట్రేడర్స్‌ను అందుబాటులో ఉంచుతాం. ఖమ్మం నుంచి కూడా ట్రేడర్స్ వస్తారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.- భూక్యా రాంబాబు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్