ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 3 : మిర్చి ఖరీదుదారులు సిండికేట్‌గా మారి రైతులకు ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. వ్యాపారుల వైఖరిని నిరసిస్తూ మిర్చి యార్డులో జెండాపాటను అడ్డుకున్నారు. ఆందోళన నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత అధికారులు తిరిగి జెండాపాట నిర్వహించారు.
తొలుత జెండాపాట క్వింటా ధర రూ.13 వేలుగా నిర్ణయించగా.. రైతు సంఘం ఆందోళన నేపథ్యంలో జెండాపాటను క్వింటా ధర రూ.14,200గా నిర్ణయించి అమలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి తమ పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు వ్యాపారులు సిండికేట్‌గా మారి ఆశించిన ధర రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మిర్చి యార్డులో వ్యాపారులు, ఉద్యోగులు కలిసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, ధర రాకుండా వ్యాపారులు అడ్డుకుంటుంటే.. దానిని అడ్డుకోవాల్సిన ఉద్యోగులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ రమేశ్‌లతో వారు సమావేశమై రైతుల సమస్యలను వివరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మహ్మద్ మౌలాన, జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్కే జానీమియా, దొండపాటి రమేశ్, గోవిందరావు, పోటు కళావతి, వెంకటరెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, మల్లేశ్, పుచ్చకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.