ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకుందామని రైతన్నలు మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో కమీషన్దారుల రూపంలో ఉన్న దళారులు దోచుకుంటున్నారు. గిట్టుబాటు ధరతో సంబంధం లేకుండా చాలా తక్కువ రేటుకు పంటను అడుగుతున్నారు. మార్కెట్లో తిష్ట వేసుకొని కూర్చున్న వ్యాపారులంతా కుమ్మక్కై మిర్చి ధర పెరగకుండా రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. గతేడాది మిర్చి ధర రూ.22 వేల పైచిలుకు ఉండగా.. ఇప్పుడు సగానికి పడిపోవడంతో రైతన్నలు కుదేలవుతున్నారు. గిట్టుబాటు ధర లేక ఈ ఏడాది అప్పులు పెరగడంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– రఘునాథపాలెం, మే 5
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దీనికితోడు మధ్యదళారులు, కమీషన్ వ్యాపారుల జోక్యంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, పాలకవర్గం మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 40 వేల పైచిలుకు మిర్చి బస్తాలు వచ్చాయి. కానీ.. ధర చూస్తే రూ.13 వేల వద్దనే ఆగిపోయింది. అందుకు ప్రధాన కారణం మార్కెట్లో కమీషన్దారుల సిండికేట్ వ్యవహారమే అని స్పష్టమవుతోంది. జెండాపాట రూ.13 వేలు పలికితే.. కమీషన్దారులు మాత్రం తేమశాతం పేరుతో రైతులను ముంచుతున్నారు. ఖమ్మం ఏఎంసీలో లైసెన్స్ లేని కమీషన్దారులే ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. వీరు చెప్పిందే ధరగా నిర్ణయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
కష్టపడేది రైతులైతే.. లాభం పొందేది మాత్రం దళారులే అన్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తీరు కనిపిస్తోంది. జెండాపాటగా పలికిన ధరలను కాకుండా తమకిష్టమొచ్చినట్లుగా ధరలను నిర్ణయించి అన్నదాతలను అడ్డంగా దోచుకుంటున్నారు. గత మూడు నెలలుగా పండించిన పంటలను నిల్వ చేసుకొని సరైన ధర పలుకుతుందేమోననే ఆశతో ఎదురుచూసిన రైతులకు మార్కెట్లో నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు మద్దతు ధర లభించకపోవడంతో చేసేది లేక ఇప్పుడు ఉన్న ధరకు అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
కానీ.. మార్కెట్కు వచ్చిన సరుకుకు ఉన్న కాస్త ధర కూడా తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెద్దపెద్ద చదువులు చదువుకొని ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయం బాటపట్టిన యువకులు సైతం మార్కెట్లో దళారుల బారినపడి మోసపోతున్నారు. ఏడాది పొడవునా కూలి, పురుగు మందుల రేట్లు పెరిగిపోతున్నా.. తాము పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము పండించిన పంటలకు సరైన మద్దతు ధర ప్రకటిస్తూ తమను దళారుల బారినపడకుండా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.