ఖమ్మం రూరల్, మార్చి 27 : ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మంగళగూడెం గ్రామానికి చెందిన బోనగిరి ఉప్పలయ్య (43) అనే రైతు పంట పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనగిరి ఉప్పలయ్య తనకున్న ఎకరం భూమితో పాటు, అదే గ్రామానికి చెందిన పావులూరి రవీందర్ వద్ద మరో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. పంటను మంగళవారం ఖమ్మం మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకొని తిరిగి ఇంటికి వచ్చాడు. పంట అమ్మగా వచ్చిన సొమ్ము.. తెచ్చిన అప్పులకు, పెట్టిన పెట్టుబడులకు ఏమాత్రం సరిపోకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు.
మధ్యాహ్నం తర్వాత పంట పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న ఉప్పలయ్య కొడుకు పొలానికి వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య ఉపేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.