‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజులు ఉండి ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెసోళ్లు కారు కూతలు కూస్తున్నారు. ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి వారినే బంగాళాఖాతంలో కలపాలి. ధరణి వల్లనే భూములపై రైతులకు సర్వ హక్కులూ వచ్చాయి’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో సోమవారం నిర్వహించిన పినపాక, భద్రాచలం నియోజకవర్గాల సీఎం ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తమ నియోజకవర్గానికి ఈ పథకం కావాలంటూ ప్రభుత్వ విప్, పినపాక అభ్యర్థి అయిన రేగా కాంతారావు కోరారని, ఆయన కోరిన విధంగానే ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్లతో నిధులతో నిర్మించే కరకట్టకు తానే శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లో రెండు రోజులు ఉండి ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి కాబట్టి ఆయా పార్టీల విధాలను, వాటి అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటు వేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో సోమవారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. 2014 ముందు రైతులు కరంటు కష్టాలతో చాలా ఇబ్బందులు పడ్డారని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని అన్నారు. ఆ ఇబ్బందులు పడలేక ఎంతోమంది రైతులు వ్యవసాయాన్ని మానుకున్నారని గుర్తుచేశారు. అలాంటి సమయంలో తెలంగాణ రావడంతో మన రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తూ వస్తున్నామని, పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా రైతుబంధును అందిస్తున్నామని గుర్తుచేశారు. రైతుబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ఇప్పుడు రూ.పది వేలు ఇస్తున్న రైతుబంధు సాయాన్ని మళ్లీ గెలిచాక రూ.16 వేలకు పెంచుతామని అన్నారు. పినపాక నియోజకవర్గంలోనే సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బరాజ్ నిర్మాణాలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి ఉమ్మడి జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందుతుందని అన్నారు.
గతంలో ఎప్పుడూ మన్యం మంచం పట్టిందనే వార్తలు చూసేవాళ్లమని సీంఎ కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధించాక ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పైగా ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇక్కడ నుంచే గోదావరి నీటిని మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి సరఫరా చేస్తున్నామని అన్నారు. భద్రాచలంలో రెండు రాష్ర్టాలకు ఉపయోగపడేలా ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, మణుగూరులోనూ పెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.
పోడుభూములకు పట్టాలిచ్చిన చరిత్ర బీఆర్ఎస్దేనని అన్నారు. పినపాక నియోజకవర్గంలో 57 వేల ఎకరాలపై 16 వేల మందికి హక్కులు కల్పించామని, రైతుబంధు అందిస్తున్నామని వివరించారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే వారికీ పట్టాలు అందిస్తామని అన్నారు.
గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక తప్రణాళిక తయారు చేశామని అన్నారు. వరదల వల్ల ఏ కొంచెమూ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఏడాది వరదల్లో 14 వేల మందికి రూ.పది వేల చొప్పున అందించామని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ఇక్కడి ప్రజలదని అన్నారు. అలాగే రేగా కాంతారావు అడిగిన సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని అన్నారు. రూ.300 కోట్లతో మన్యంలో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని అన్నారు.
ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ కోరారు. మంచి మనిషిని చూసి ఓటెయ్యాలని సూచించారు. కారుగుర్తుకు ఓటు వేసి ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బూర్గంపహాడ్/ సారపాక, నవంబర్ 13: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆయన సహకారంతోనే రూ.వేల కోట్లను తీసుకొచ్చి నియోజకవర్గన్ని తీర్చిదిద్దామని అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దళితులందరికీ దళితబంధును అందిస్తామన్నందుకు నియోజకవర్గ దళిత సోదరుల తరఫున సీఎం కేసీఆర్‌కు తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. దశాబ్దాల పోడు సమస్యకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని అన్నారు. తాను కూడా ఇక్కడి పోడు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. పెద్దమనసుతో ఈ సమస్యపై అధ్యయనం చేసి ఈ ప్రాంత పోడురైతులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలిచ్చిన తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ అని కొనియాడారు.
పోడు రైతులందరికీ పట్టాలు, రైతుబంధు, రైతుబీమా అందడంతో తన జన్మధన్యమైనట్లయిందని అన్నారు. ఇంకా కొంతమంది రైతులకు పోడు పట్టాలు అందాల్సి ఉందని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే వారికీ అందిస్తామని అన్నారు. అనంతరం నియోజకవర్గంలో పలు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. పినపాక నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న మణుగూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, మణుగూరులో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ వేతనాలు పెంచేలా జీవోను తీసుకురావాలని, ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని కోరారు. ప్రధానంగా వరదల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనేతరులకు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని, అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల్లో 8 వేల ఎకరాల్లో పాత పట్టాలు రైతులకు ధరణి ద్వారా కొత్తగా పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెసోళ్లు కారు కూతలు కూస్తున్నారని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా అసలు బంగాళాఖాతంలో కలిపేది కాంగ్రెసోళ్లనేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమంటూ కొంతమంది అహంకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. గేట్లు తాకనిచ్చేది వాళ్లు కాదని, ప్రజలేనని అన్నారు. ఓటు ద్వారానే కాంగ్రెసోళ్లకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ధరణి వల్లనే భూములపై రైతులకు సర్వ హక్కులూ వచ్చాయని అన్నారు.