మామిళ్లగూడెం, జనవరి 20: జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పీఎస్ఈ ఎంట్రీల ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ‘జాతీయ ఓటర్ దినోత్సవం పీఎస్ఈ ఎంట్రీల ధ్రువీకరణ – ఓటర్ ఎపిక్ కార్డుల పంపిణీ – ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ’పై సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవికిరణ్‌తో కలిసి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాటను ప్రతి జిల్లాలోనూ మైకుల ద్వారా వినిపించాలని, అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు.
80 ఏళ్లు పైబడిన, నూత నంగా ఓటు హక్కు పొందిన ఓటరను సన్మానించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ అందించే ఓటరు పాటను స్థానిక కేబుల్ చానెళ్లలోనూ, సినిమా థియేటర్లలోనూ ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం ఓటరు దినోత్సవ థీమ్ ‘నథింగ్ లైక్ ఓటింగ్ – ఐ ఓట్ ఫర్ ష్యూర్’ ప్రకారం ప్రతి ఒకరూ తప్పనిసరిగా ఓటు హకు వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ లింకేజీ అనుసంధానం ప్రశంసనీయంగా ఉందని, అర్బన్ ప్రాంతాల్లో తక్కువగా ఉందని అన్నారు. జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారికి పోస్టల్ శాఖ ద్వారా ఓటు గుర్తింపు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో వంద శాతం ఆధార్ లింకేజీకి చర్యలు చేపట్టామని, వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.