ఆరుగాలం శ్రమించే తెలంగాణ రైతులన్నలకు చెందాల్సిన ధాన్యం బోసస్ ఆంధ్రా వ్యాపారుల పాలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ ఆంధ్రా అక్రమార్కుల ధనార్జనకు అవకాశంగా మారింది. కాయకష్టం చేస్తున్న రైతులకు దాక్కాల్సిన ఫలితం దళారులకు చేరుతోంది. ఒక్కో లారీకి రూ.2 లక్షల చొప్పున రోజుకు 50 నుంచి 100 లారీల ధాన్యమంటే ఒక్క రోజుకు తెలంగాణ రైతుల బోనస్ ఆంధ్రా వ్యాపారుల చేతుల్లోకి ఎంత పెద్ద మొత్తంలో వెళ్లిందనే విషయం అర్థమవుతోంది. చిన్నచిన్న వస్తువులను కన్పించకుండా చెక్‌పోస్టులు దాటించినంత సులువుగా ధాన్యం లోడుతో వందల సంఖ్యలో పెద్ద పెద్ద లారీలనే రాష్ర్టాలు, జిల్లాలు, చెక్‌పోస్టులు దాటించి తీసుకొస్తున్నారంటే ఇన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఆ వ్యవస్థలకు తెలిసే జరుగుతోందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరు కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. రైతులు పట్టుకున్న లారీలను పరిశీలించిన అధికారులు.. అనుమతులు లేవంటూ వాటిని వెనక్కు పంపారు తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం అనేక ప్రశ్నలను మిగులుస్తోంది.
కూసుమంచి (నేలకొండపల్లి), డిసెంబర్ 18: ‘ఆంధ్రా సరిహద్దుల్లోని తెలంగాణలో ఉన్న ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న మిల్లర్లు, పలు శాఖల అధికారుల పాత్ర లేనిదే ఇంత పెద్ద దందాకు అవకాశం ఉంటుందా?’ అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నేలకొండపల్లి, ముదిగొండల రైతులు ఆదివారం ఒక్క రోజే 31 లారీలు పట్టుకోగా.. అధికారులు వాటిని వెనక్కి పంపారు. కానీ, ‘ఆంధ్రా నుంచి వచ్చిన ధాన్యానికి తెలంగాణ రైతుల పేర్లతో ఎలా రసీదులున్నాయి? వాటిని ఎవరిచ్చారు? ఎన్ని రోజులుగా ఇలా ఇస్తున్నారు?’ అనే విషయాల జోలికి అధికారులు వెళ్లకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు బాధ్యులైన సివిల్ సప్లయీస్ అధికారులు.. ఆంధ్రా ధాన్యానికి అనుమతి లేదంటూ వెనక్కు చేతులు దులుపుకోవడం విడ్డూరంగా కన్పిస్తోంది. చివరికి రైతులు పట్టుకుంటే తప్ప కనీసం జాడ తెలుసుకోలేని దుస్థితిలో అధికారులు ఉండడం గమనార్హం. మరి ‘మేం పట్టుకున్న లారీలను, ధాన్యాన్ని సీజ్ చేసి ఎందుకు విచారణ చేపట్టడం లేదు?’ అనే ప్రశ్నలు రైతులు, స్థానికుల నుంచి వస్తున్నాయి. ఆంధ్రా వ్యాపారులతో ఇక్కడి అధికారులకు, మిల్లర్లకు ఒప్పందాలు ఉన్నందునే తాము పట్టుకున్న లారీలను వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. పట్టుకున్న ధాన్యాన్ని, లారీలను అధికారులు సీజ్ చేయకపోతే అవి మరో మార్గంలో మళ్లీ మిల్లర్ల వద్దకు చేరుకునే అవకాశం లేకపోలేదని రైతులు వాపోతున్నారు.
రోజుకు రూ.కోటికిపైగా అక్రమార్జన..
ఒక్కో లారీలో 350 నుంచి 400 క్వింటాళ్ల ధాన్యం తరలించొచ్చని రైతులు పేర్కొంటున్నారు. ఇలా వందలాది లారీలతో ధాన్యం తరలించి లారీకి రూ.2 లక్షల చొప్పున రోజుకు రూ.కోటికిపైగా అక్రమార్జన చేసే అవకాశముందంటూ ధాన్యాన్ని పట్టుకున్న తెలంగాణ రైతులే గణాంకాలు చెబుతున్నారు. అధికారులు, అక్రమార్కుల కనుసన్నల్లోనే ధాన్యం ఇంత పెద్ద మొత్తంలో తరలుతున్నట్లు వారు స్పష్టంచేస్తున్నారు. పైగా, రోజుకు పదుల సంఖ్యలో ధాన్యం లారీలు 20 రోజులుగా అడ్డదారుల్లో బారులు తీరి వస్తున్నా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు కనిపెట్టలేకపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక, ఆంధ్రా ధాన్యానికి తెలంగాణ చెక్‌పోస్టుల్లో ఇక్కడి రైతు ల పేర్లతో ‘సర్టిఫికెట్ 10’లు ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? అనేవి అతిపెద్ద ప్రశ్నలుగా ఉన్నాయి. అధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టకపోవడం గమనార్హం. పైగా ఓవర్ లోడ్, బోర్డర్ సెస్ చెల్లించి మళ్లీ ఆ లారీలు తెలంగాణలోకి రావడం విశేషం.
అక్రమ మార్గాలే రాజమార్గాలు..
విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే మీదుగా ఆంధ్రా అక్రమార్కులు కొద్ది రోజులు ధాన్యం లావాదేవీలు నడిపారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ఎక్కువగా చేయడంతోపాటు లారీకి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సెస్, ఫైన్ వంటివి చెల్లించాల్సి వస్తోంది. వీటిని తప్పించుకునేందుకు జగ్గయ్యపేట, గండ్రాయి, షేర్‌మహ్మద్‌పేట, వత్సవాయి మీదుగా ఖమ్మం జిల్లాలోకి లారీలు ప్రవేశిస్తున్నాయి. ఇక్కడి నుంచి కోదాడ, మిర్యాలగూడెం, హుజూర్నగర్, తిరుమలగిరి, కొండమల్లేపల్లి వంటి ప్రాంతాల్లోని మిల్లల్లో ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే వల్లభి, అప్పలనర్సింహాపురం, చెరువుమాధారం గ్రామాల్లో 31 లారీలను అక్కడి రైతులు పట్టుకున్న విషయం విదితమే. మరో 20కిపైగా లారీలు వేర్వేరు మార్గాల్లో సూర్యాపేట జిల్లాలోని పలు మిల్లులకు చేరుకున్నట్లు తెలుస్తోంది.