ఖమ్మం కమాన్బజార్, జనవరి 4: కార్పొరేట్ సంస్థల కోసమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్పు చేసిందని, దీని వెనుకు పెద్ద కుట్ర దాగి ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయం (గిరిప్రసాద్ భవన్)లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీని చరిత్ర నుంచి చెరిపేసేందుకు బీజేపీ చూస్తోందని విమర్శించారు. గాంధీని భౌతికంగా చంపేసిన సంఘ్ పరివార్ అనుకూలురు ఇప్పుడు గాంధీపేరు మార్చారన్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం 40కుటుంబాల కోసం 28లక్షల కోట్ల రూపాయల రాయితీని ప్రకటించిందని, కానీ 85కోట్ల మంది ప్రజల కోసం 10లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు జంకుతుందని దుయ్యబట్టారు.
ఉపాధిహామీ పథకాన్ని పూర్తిగా నీర్చుగార్చి కూలీలకు పనులు దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త స్కీంలో 40శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం సాధ్యంకాదన్నారు. ఇప్పటికే జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దోపిడీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో మార్పును ఉపసంసహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంపద కోసమే అమెరికా వెనెజువెలాపై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ దాడి చేయడాన్ని యావత్ ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు పసలేనివని, వెనెజువెలాలోని ఆయిల్ సంపదను తమ వశం చేసుకునేందుకే ట్రంప్ వెనెజువెలా దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలుగా చేశారని ఆరోపించారు. వెనెజువెలాపై దాడి భారతదేశానికి నష్టమని దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ఎగుమతులని అడ్డం పెట్టుకుని భవిష్యత్లో అమెరికా ఒత్తిది తెచ్చే ప్రమాదం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే నిధుల కోసం కేంద్రాన్ని దేబిరించడం(అడుక్కోవడం) సరికాదన్నారు. తెలుగు రాష్ర్టాల మధ్యనీటి పంచాయితీ తగదని, ఇద్దరు సీఎంలు కూర్చొని సమస్యపై చర్చించాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో విలీనమైన భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు. దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి నష్టం లేదన్నారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభ జరుగుతుందని, దీనికి విదేశీ ప్రతినిధులు హాజరవుతురని తెలిపారు. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు ఎర్రా బాబు, లతాదేవి, కర్ణకుమార్ పాల్గొన్నారు.