సైన్స్ అంటే మక్కువ పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ అంటే భయం పోవాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథంతోపాటు వినూత్న ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి.. ఇవన్నీ తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనకు తోడు సైన్స్ మ్యూజియంతో సాధ్యమవుతాయని భావించిన విద్యాశాఖ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం నగరంలోని పాత డీఈవో కార్యాలయాన్నే మ్యూజియంగా ముస్తాబు చేస్తున్న అధికారులు.. అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు ‘బిర్లా సైన్స్’ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
– ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 10
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 10 : జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఖమ్మం నగరంలోని పాత డీఈవో కార్యాలయాన్నే మ్యూజియంగా మలిచేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పది రోజుల నుంచి పనులు కొనసాగుతున్నాయి. సైన్స్ పరికరాలను సమకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మ్యూజియం ఏర్పాటుకు 2003లోనే నాటి ప్రభుత్వం రెండు విడతలుగా రూ.30లక్షల నిధులు మంజూరు చేసింది. వివిధ కారణాలతో ఆ పనుల ప్రతిపాదన ఆగిపోయింది. దీంతో నిధులను నాడు డీఆర్వో, డీఎస్వో జాయింట్ అకౌంట్లో నాటి అధికారులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ సొమ్ము ఇప్పుడు వడ్డీతోసహా కలిపి రూ.50లక్షలకు పైగా పెరిగింది. వీటిలో రూ.19లక్షలతో ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు భవనాన్ని మ్యూజియానికి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు. గదులవారీగా భవన నిర్మాణం ఉండగా.. దానిని విశాలమైన హాల్‌గా మలుస్తున్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.
సైన్స్ మ్యూజియానికి అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు విద్యాశాఖ ‘బిర్లా సైన్స్’ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నది. మంగళవారం డీఈవో సోమశేఖర శర్మ, డీఎస్వో సైదులు, బిర్లా సైన్స్ ప్రతినిధులు, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్ ఫోరం టీచర్లు మ్యూజియం పనులను పరిశీలించారు. మ్యూజియానికి సమకూర్చాల్సిన అవసరాలను గుర్తించారు. దాదాపు రూ.30లక్షల వరకు ఖర్చు చేస్తే సైన్స్ మ్యూజియానికి అవసరమైన పరికరాలు సమకూరుతాయని అంచనా వేశారు. తరగతులవారీగా ఏయే పరికరాలు ముఖ్యమైనవి అనే వాటితోపాటు ముఖ్యంగా జీవశాస్త్రం సబ్జెక్ట్‌లోని అన్ని పరికరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
కలెక్టర్‌కు నివేదిక& సైన్స్ మ్యూజియానికి సంబంధించి పరికరాల కొనుగోలుపై అంచనా వేయడంతోపాటు నిర్మాణ పనులపై కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అధికారులు వివరించారు. అయితే మ్యూజియానికి సంబంధించిన డబ్బులు ఎస్బీఐ అకౌంట్లో ఉండడంతో నిర్వహణ లేకపోవడంతో దానిని ఫ్రీజ్ చేశారు. దీనిపై డైరెక్టర్ నుంచి అనుమతి తేవాలని బ్యాంక్ అధికారులు సూచించగా.. ఆ అంశాన్ని సైతం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపై కలెక్టర్‌తో డీఈవో సోమశేఖర శర్మ, డీఎస్వో సైదులు చర్చించారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు జిల్లాలో సైన్స్ మ్యూజియం నెలకొల్పేందుకు అధికారులు చేపట్టిన కృషి ఎట్టకేలకు ఫలిస్తోంది. డీపీఈపీ పథకంలో భాగంగా రెండు విడతల్లో రూ.30లక్షలు కేటాయించింది. 2003లో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు రాగా.. అప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం తలెత్తుతోంది. 2014లో ఎన్నెస్పీలో స్థలాన్ని గుర్తించిన అధికారులు నివేదిక సమర్పించేలోగా దానికి ఎన్నెస్పీ, ఐటీడీఏ అధికారులు అనుమతించకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే డీఈవో కార్యాలయం నూతన కలెక్టరేట్‌లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు కలెక్టర్ వీపీ గౌతమ్ కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలకు సైన్స్ సెంటర్, సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో 20 ఏళ్ల సమస్యకు తెరపడింది. త్వరలోనే సైన్స్ మ్యూజియం ప్రారంభించనుండడంతో ఏళ్లనాటి కల సాకారం కానున్నది.