ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 12: ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృంద అధికారులు రెండో రోజు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో కేంద్ర అధికారులు మహేశ్‌కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కే కుష్వాహ, టీ.నియాల్ కన్సన్, డాక్టర్ శశివర్ధన్రెడ్డిలతో కూడిన కేంద్ర బృంద సభ్యులు ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా ఏర్పడి జిల్లాలో పర్యటించారు.
మొదటి బృంద సభ్యులు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, ఖమ్మం కాల్వొడ్డు, బొకలగడ్డ, ప్రకాశ్‌నగర్ మున్నేరుబ్రిడ్జి, మోతీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. రెండో బృంద సభ్యులు ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం, తల్లంపాడు – తెల్దారుపల్లి, తనగంపాడు, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో పర్యటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్నేరు ఉధృతి ఎలా ఉందో, ప్రవాహం ఏ మేరకు వచ్చిందో, ప్రవాహం ఎంత సమయం మేర నిలిచిందో అనే అంశాలను ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందానికి వివరించారు. నష్ట వివరాలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర బృందానికి చూపించారు.
ఈ సందర్భంగా బాధితులు కేంద్ర అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇళ్లు దెబ్బతిన్నాయని, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయామని మొరపెట్టుకున్నారు. రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ కూడా పర్యటించి నష్ట తీవ్రతను పరిశీలించారు. అనంతరం కేంద్ర బృంద ఇన్చార్జి కల్నల్ కేపీ సింగ్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా నాటి విలయాన్ని గమనించామని అన్నారు. నష్టం తీవ్రతపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజీవ్ గృహకల్ప, జలగంనగర్‌లో పర్యటించిన కేంద్ర బృంద అధికారులు మున్నేటి వరదకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. నష్టం తీవ్రత గురించి కేంద్ర బృందానికి ఖమ్మం కలెక్టర్ ఖాన్ వివరించారు. గృహకల్పలో మొత్తం 33 బ్లాకుల్లో 320 కుటుంబాల వారు నివసిస్తున్నారని, మున్నేటి నుంచి ఆకస్మికంగా వరద రావడంతో ఇక్కడి ప్రజలందరూ కట్టుబట్టలతో బయటకు వెళ్లారని అన్నారు. ఇంటి సామాన్లన్నీ వరదలో కొట్టుకపోయాని, మరికొన్ని వస్తువులు బురదమయమయ్యాయని వివరించారు. తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో కుమార్, ఎంపీవో రాజారావు పాల్గొన్నారు.