ఖమ్మం రూరల్, నవంబర్ 18: ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు రెండో రోజు సైతం మూతపడ్డాయి. దీంతో మంగళవారం పత్తి పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిన్నింగ్ మిల్లుల యజమానులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా గుర్రాలపాడు, పొన్నెకల్ గ్రామాల పరిధిలోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు, తల్లంపాడు వద్ద గల సాయి బాలాజీ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు యజమానులు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం పత్తి సీజన్ కావడంతో ఖమ్మంజిల్లాలోని ముదిగొండ, నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, కూసుమంచి, ఖమ్మంరూరల్ తదితర మండలాల నుంచి రైతులు భారీగా పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే కొనుగోళ్లు లేకపోవడంతో తిరిగి నిరాశగా పంటను ఇంటికి తీసుకెళ్తున్నారు. సీసీఐ అధికారులు అనేక నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెడుతున్న కారణంగానే తాము నిరవధిక బంద్‌లో పాల్గొంటున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు పేర్కొంటున్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 అనే సైజులు పెట్టడంతోపాటు ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
లూజు పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు తిరిగి మార్కెట్‌కు తీసుకెళ్లలేక ఇంటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ట్రాక్టర్లు, ట్రాలీల్లో పంటను తీసుకొచ్చిన రైతులు రెండ్రోజుల నుంచి వాటికి కిరాయిలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ట్రాక్టర్ పేరుమీద రెండ్రోజుల్లో ఎగుమతి కూలీలు, కిరాయిలు కలుపుకొని రూ.10 వేల వరకు ఖర్చు అయ్యిందని, సీసీఐ అధికారులు ఇప్పటికైనా తమ ఇబ్బందులను గుర్తించాలని ఆవేదన వ్యక్తంచేశారు. సీసీఐ కేంద్రాల నుంచి తిరిగి మార్కెట్‌కు పంటను తీసుకెళ్తే క్వింటాల్ రూ.6 వేలకు మించి పలకడం లేదని దీంతో తాము క్వింటాల్‌కు రూ.2 వేలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. దీనికితోడు డబుల్ కిరాయిలు అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రెండు రోజుల్లో రూ.10 వేల ఖర్చు..
సోమవారం రోజున చిరుమర్రి నుంచి పత్తి పంటను ట్రాక్టర్లో రూ.3 వేల కిరాయి మాట్లాడుకొని గుర్రాలపాడు జిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చాను. ఆ రోజు కొనుగోలు చేయలేదు.. మంగళవారం సైతం ఇక్కడే ఉన్నాం. రెండు రోజులకు గాను రూ.6 వేలు కిరాయి అయ్యింది. దీనికితోడు ట్రాక్టర్ లోడ్ తొక్కినందుకు కూలీలకు రూ.4 వేలు కలిపి మొత్తంగా రూ.10 వేల ఖర్చు వచ్చింది. ఎప్పుడు కొనుగోలు జరుగుతాయో తెలియడం లేదు. మార్కెట్‌కు పోయిన ఇంత ఇబ్బంది ఉండేది కాదు.
-గుండు సురేశ్, రైతు, చిరుమర్రి, బోనకల్లు
తెరుచుకోని జిన్నింగ్ మిల్లులు
రఘునాథపాలెం, నవంబర్ 18: ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల బంద్ రెండో రోజు మంగళవారమూ కొనసాగింది. సీసీఐ నిబంధనలు ఎత్తివేసే వరకూ బంద్‌ను విరమించేది లేదని జిన్నింగ్ మిల్లుల యజమానులు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ విషయం తెలియని పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని పత్తిని సీసీఐ కేంద్రాలున్న జిన్నింగ్ మిల్లులకు ప్రైవేటు వాహనాల్లో తెస్తున్నారు. మంగళవారం కూడా చాలామంది రైతులు ట్రాక్టర్లు, వ్యాన్లకు కిరాయిలు వెచ్చించి మరీ వాటిల్లో వాటిల్లో పత్తిని నింపుకొని వచ్చారు.
తీరా ఇక్కడికి వచ్చాక జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తుండడంతో పడిగాపులు కాస్తున్నారు. తెచ్చిన పంటలను వెనక్కు తీసుకెళ్లలేక అక్కడే ఉంటున్నారు. వాహనాల్లో పత్తి ఉండడం వల్ల రోజుల తరబడి కిరాయిలనూ భరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 8 జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోళ్లు గతంలో ప్రారంభమయ్యాయి. మధిరలోని ఓ జిన్నింగ్ మిల్లులో పలు కారణాలతో సీసీఐ కొనుగోళ్లు జరగడం లేదు. పాలేరు, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలోని జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే సీసీఐ కొనుగోళ్లు జరుగుతున్నాయి. బంద్ కారణంగా రెండు రోజులుగా ఆ మిల్లులు తెరుచుకోవడం లేదు.