ఖమ్మం, ఫిబ్రవరి 12 : కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, తప్పులతడకగా ఉందని బీఆర్ఎస్ పార్టీ లెకలతో సహా నిరూపించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రీసర్వేకు అంగీకరించడాన్ని ఆ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్వాగతించారు. ఈసారైనా ఎన్యూమరేట్స్ ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని, వాటన్నింటిని క్రోడీకరించి సరైన లెకలు వెల్లడించాలని బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓబీసీలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నదని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ చేసిన తీర్మానానికి అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి చట్టసభల్లో 33శాతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరారు. ఓబీసీల సమగ్రాభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మంత్రి మండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో నాలుగింటిని బీసీలకిచ్చి ప్రాధాన్యతశాఖలు కేటాయించాలని కాంగ్రెస్ను డిమాండ్ చేశారు.