భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఆమెది చుంచుపల్లి మండలం రాంనగర్ గ్రామం. పేరు బండి సరోజ. ఎప్పటినుంచో ఓటు వేస్తున్నది. 2002లో కూడా సుజాతనగర్ నియోజకవర్గంలో 164, 165 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కానీ, ఇప్పుడు ఆమె పేరు ఓటరు జాబితాలో లేదు. వాళ్ల ఇంట్లో పిల్లలకు మిగతా వాళ్లందరికీ ఓట్లు ఉన్నాయి. కానీ, ఆమెకు మాత్రం ఓటు లేదు. 2002లో ఓటు లిస్టులో లేకపోవడంతో తను ఆందోళన చెందుతున్నది. నాకు ఓటు ఉండదా.. చాలా ఏళ్ల నుంచి ఓటు వేస్తున్నాను. నాకు ఓటు ఎట్లా అని ఆమె బీఎల్వోను ప్రశ్నిస్తున్నది. ఇది ఈమె ఒక్కరి సమస్యే కాదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలామందికి ఓటరు ఫారాలు కూడా రాలేదు. వారి ఓట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇంత గందరగోళంగా ఉన్నా అధికారులు మాత్రం వాళ్లకి సరైన సమాధానాలు చెప్పకపోవడంతో సందేహాలున్న వారు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఫారాలు ఇంటికి చేరుతున్నాయో లేదో చూస్తున్నారు.. కానీ, వాటిని ఎట్లా నింపుతున్నారనేది మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో తెలిసీతెలియని వారు తప్పులతడకలుగా నింపడంతో ఓట్లు ఉంటాయో.. పోతాయో అని భయపడుతున్నారు. గ్రామస్థాయిలో చాలామందికి సర్‌పై అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అన్నీ కొట్టివేతలతో నింపడం వల్ల ఓట్లు గల్లంతవుతాయని ఓటర్లు భయపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.. సమస్యలపై దృష్టి పెట్టడంలేదు. గ్రామస్థాయిలో వచ్చే సమస్యలు కూడా బీఎల్వోలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. కొన్ని గ్రామాల్లో ఇంకా బీఎల్వోలు ఫారాలు ఇంటింటికీ ఇవ్వకపోవడంతో అసలు మాకు ఓట్లు ఉన్నాయో.. లేవో.. అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువు దగ్గర పడటంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 24వ తేదీకల్లా పూర్తి వివరాలు అప్లోడ్ కావాలని ఎన్నికల కమిషన్ గడువు విధించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ, నేటివరకు 9,96,198 ఓటర్లకు గాను.. 1,30,000 ఓట్లు మాత్రమే ఆన్లైన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీకల్లా పూర్తి ఓటర్ల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. కానీ, ఫీల్డ్లెవల్లో పనిచేసే వారు మాత్రం సమయానికి ఆన్లైన్ అవ్వకపోవచ్చని అంటున్నారు. ఎన్ని హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినా సర్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షణ చేస్తే తప్ప అవి పూర్తిస్థాయిలో ఫారాలు అప్లోడ్ కావని కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు.
ఎన్నికలొస్తే రాజకీయ నాయకులు ఓటర్లపై ఎంతో ప్రేమ చూపిస్తారు. కానీ, ఓటర్ల సవరణలో మాత్రం ఓటర్లపై నాయకులు అంతపెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఎక్కువ శాతం బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఏలుగా ఉన్నవారు మాత్రం ఇంటింటికీ వెళ్లి ఫారాలు ఇచ్చి వాటిని నింపుతున్నారు. కానీ, వేరే నాయకులు మాత్రం అక్కడక్కడనే కనిపిస్తున్నారు. ఒకటీ రెండు పార్టీలు మినహా ఇతర పార్టీలు సర్ కార్యక్రమానికి దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫొటోల వరకు ఉండి తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నారని విమర్శలున్నాయి.
మా ఇంట్లో ఇచ్చిన ఫారాలు అన్నీ కొట్టివేతలు వచ్చాయి. ఎట్లా నింపాలో ఎవరూ చెప్పలేదు. ఎవరి అడ్రస్‌లు రాయాలో తెలియక తికమకపడ్డాం. అవి ఉంటాయో.. రిజక్ట్ అవుతాయో.. తెలియదు. చెప్పాల్సిన వారు ఎవరూ ఇంతవరకు ఇంటికొచ్చి చెప్పలేదు. మైక్‌ల ద్వారా ఆయా పార్టీల వారు ప్రచారం చేస్తున్నారు.. కానీ, దానిపై క్లారిటీగా ఎవరూ చెప్పిందిలేదు.
– ఆరెళ్ల లక్ష్మణ్, దాస్తండా, టేకులపల్లి మండలం
బీఎల్వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు సరిగ్గా నింపకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అందరూ చెబుతున్నారు. దీనిని ఎలా పూర్తి చేయాలనేది ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. కాలమ్స్ కూడా పూర్తిగా కనిపించడం లేదు. అధికారులు తమ ఇళ్ల వద్దకు వచ్చి ఫారాలు నింపే విధంగా చూడాలి. లేదంటే సమావేశాలు పెట్టి ఫారాలు నింపేదానిపై అందరికి అవగాహన కల్పిస్తే బాగుంటుంది.
– ఆకుల స్రవంతి, నెంబర్ టూ బస్తీ, ఇల్లెందు మండలం
చాలామందికి సందేహాలు ఉన్నాయి.. వాటన్నింటికి పరిష్కారం ఉంది. 2002 ఓటరు లిస్టులో పేరులేకపోయినా ఓటుహక్కు ఎక్కడికీ పోదు. దానికి బదులు వారు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇస్తే సరిపోతుంది. వారి ప్రూఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. కొట్టివేతలు ఉన్నా మళ్లీ చెరిపి రాసుకోవచ్చు. ఆన్లైన్ చేసినప్పుడు కరెక్టుగా రాస్తే సరిపోతుంది. ఈ నెల 24వ తేదీకల్లా పూర్తవుతాయి.
– రంగా ప్రసాద్, ఎలక్షన్ సూపరింటెండెంట్, భద్రాద్రి జిల్లా