గ్రామాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారపర్వం హోరెత్తుతోంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిన విషయం విదితమే. అయితే, ఆయా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ సెట్‌గా దాఖలైన నామినేషన్లను అధికారులు గురువారం పరిశీలించి వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 192 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తరువాత జిల్లాలో 20 సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే ఉండడంతో అవి ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. దీంతో 172 సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోరు జరుగనుంది.
ఖమ్మం, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసేందుకు యువకులు, రైతులు, మహిళలు అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో గ్రామాల్లో పోటీ రసవత్తరంగా మారింది. అనేక పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అధికార పార్టీ అనేక చోట్ల ఒత్తిళ్లు చేసినప్పటికీ ప్రజలు అంగీకరించకపోవడం, అభ్యర్థులు ఆసక్తి చూపడం వంటి కారణాలతో చివరి నిమిషంలో చాలాచోట్ల ఏకగ్రీవాల ప్రయత్నాలు నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో గతంలో మెజారిటీ పంచాయతీ స్థానాలను సాధించిన బీఆర్ఎస్.. ఈసారి కూడా తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.
పల్లెల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత..
గ్యారెంటీ హామీలు అమలు చేయకపోవడం, పల్లెల్లో పాలన పడకేయడం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక కార్యక్రమాలను ముందుకు సాగనీయకపోవడం వంటి కారణాలతో గ్రామాల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే.. పంచాయతీ ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, అసలు వాటి ఈఎంఐలు చెల్లించకపోవడం, పల్లె ప్రకృతి వనాలను, వైకుంఠధామాలను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల రేవంత్ పాలనపై గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయినప్పటికీ పంచాయతీల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పంతంతో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.
బీఆర్ఎస్ మద్దతుదారుల విస్తృత ప్రచారం..
గత పర్యాయాల్లో కేసీఆర్ ప్రభుత్వం అందించిన సుపరిపాలనను వివరిస్తూ బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక, ఈ నెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 172 సర్పంచ్ స్థానాలకు 476 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 1,740 వార్డు స్థానాలకుగాను 1,738 స్థానాల్లో ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 1,738 వార్డు స్థానాల్లో 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,415 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి మొత్తం 3,275 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అక్కడ ఉప సర్పంచ్ స్థానాలూ ఏక గ్రీవం..
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన చోట గురువారం ఉప సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ కూడా పలుచోట్ల ఉప సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చింతకాని మండలం రాఘవాపురంలో మాత్రం ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. అయితే, ఇవి పంచాయతీ ఎన్నికలే అయినప్పటికీ.. సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది.