మధిర, అక్టోబర్ 31: చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు, రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సామినేని రామారావు (70)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అతడి భార్య, స్థానికుల కథనం ప్రకారం.. రామారావు సీపీఎంలో చురుగ్గా ఉంటూ పాతర్లపాడులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగానే శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి ఆవరణలో ఉన్న కొట్టంలో రెండు గంపల్లో కప్పి ఉంచిన పెంపుడు కోళ్లను విడిచి పెట్టేందుకు వెళ్లాడు.
అకడే మాటువేసి ఉన్న గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి ఛాతిపై విచక్షణారహితంగా పొడిచారు. ఆ సమయంలో భర్త అరుపులు విన్న భార్య స్వరాజ్యం హుటాహుటిన వచ్చి భర్తపై జరుగుతున్న దాడిని చూసి కేకలు వేసింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అకడికి చేరుకుంటుండడంతో దుండగులు ఇంటి వెనుక భాగం నుంచి పరారయ్యారు. అప్పటికే రామారావు తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయి రక్తపు మడుగుల్లోనే ప్రాణాలు విడిచారు. పాతర్లపాడులో 43 ఏళ్ల క్రితం సీపీఎం, కాంగ్రెస్ మధ్య రాజకీయ హత్యలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు సీపీఎం నేత సామినేని రామారావు హత్యతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
పాతర్లపాడులో హత్య విషయం తెలుసుకున్న ఖమ్మం సీపీ సునీల్‌దత్ హుటాహుటీన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని రామారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన భార్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్వాడ్‌ను పిలిపించి దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, హత్యకు పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. రామారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రామారావు సీపీఎం నాయకుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. సర్పంచ్‌గా రెండు పర్యాయాలు, ఆయన భార్య స్వరాజ్యం ఒక పర్యాయం ఎన్నికయ్యారు.
సీపీఎం నాయకుడు సామినేని రామారావును కాంగ్రెస్ గూండాలే హత్య చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఆరోపించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు.. శుక్రవారం పాతర్లపాడు గ్రామానికి చేరుకొని రామారావు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. గత దసరా పండుగ రోజు సీపీఎం, కాంగ్రెస్ మధ్య జరిగిన చిన్న ఘర్షణ పోలీస్ కేసుల వరకు వెళ్లిందని, దాన్ని మనసులో పెట్టుకొని కాంగ్రెస్ గూండాలే పథకం ప్రకారం రామారావును అతి కిరాతకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రామారావును హత్య చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక తమకు అడ్డు ఉండదని అకసుతోనే కుట్ర చేసినట్లు ఆరోపించారు. తన నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం బోనకల్లు మండలం గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన సీపీఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరరావును కూడా కాంగ్రెస్ గూండాలే హత్య చేశారని ఆరోపించారు.
తన భర్త రామారావును ఆరుగురు వ్యక్తులు కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారని ఆయన భార్య స్వరాజ్యం చింతకాని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎరుపు, నలుపురంగు టీషర్టు ధరించిన ఒక వ్యక్తి కత్తితో భర్తపై దాడి చేస్తున్నాడని తెలిపింది. అతడితోపాటు తమ గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కాండ్ర పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై వీరేంద్ర కేసు నమోదు చేశారు.