ఖమ్మం, మే 7: ఉగ్రవాదం లేని సమాజం ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ సరైన రీతిలో బుద్ధి చెప్పడాన్ని హర్షిస్తున్నామని, దేశ సమగ్రత, సామరస్యాన్ని, దేశ పౌరులను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
బుధవారం ఖమ్మంలోని తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతితో కలిసి మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా మన దాయాది దేశం పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారత్, అఫ్గానిస్థాన్, రష్యాలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఉగ్రవాదుల తయారీ దేశంగా పాకిస్థాన్ ఉంటుందన్నారు. బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడిన నాటినుంచి పాకిస్థాన్ భారతదేశ ఆస్తులను నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తుందన్నారు.
తమ స్వలాభం కోసం కొన్ని దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతున్నాయన్నారు. దేశప్రజలు ముక్తకంఠంతో ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకలించాలని కోరారు. ఉగ్రవాదం పెంచి పోషించే దేశాలను, ఉగ్రవాదాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. భారత ఆర్మీకి బీఆర్ఎస్ సెల్యూట్ చేస్తుందని, ఇది మనం గర్వపడే సమయం, ఇందులో మనం కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఉదయం 10గంటలకు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహావిషరణ చేసేందుకు తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని తెలిపారు.
అంజనాపురంలో ఏర్పాటు చేసిన హెలిఫ్యాడ్ వద్ద దిగి ర్యాలీగా మిట్టపల్లికి చేరుకుంటారని, అక్కడ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారని అన్నారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు, భాషబోయిన వీరన్న, మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జిల్లా నాయకులు ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, లకావత్ గిరిబాబు, తాజుద్దీన్, పొట్ల శీను, ఉద్యమకారులు పగడాల నరేందర్, సతీష్, నాయకులు బంక మల్లన్న, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, సద్దాం తదితరులు పాల్గొన్నారు.