భద్రాచలం, అక్టోబర్ 26: భద్రాచలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థినిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన మైనార్టీ గురుకులంలో చదివి, నీట్లో ప్రతిభ చూపి కన్వీనర్ కోటాలో ఉచిత ఎంబీబీసీ సీటును సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు విద్యార్థిని కృషిని, పట్టుదలను ప్రశంసించారు. భద్రాచలానికి చెందిన గాలి అచ్యుత్ – స్వరూప దంపతుల కుమార్తె అనూష బూర్గంపహాడ్‌లోని మైనార్టీ గురుకులంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఈ గురుకులాన్ని నిర్మించి ఇందులో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించారు. అందులో చేరి నాణ్యమైన విద్యను పూర్తిచేసుకున్న సదరు విద్యార్థిని అనూష.. వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌లోనూ ప్రతిభ చాటింది. ఈ మేరకు ఇటీవల ఆమెకు ఉచిత ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి విషయాన్ని వివరించారు. దీంతో సదరు విద్యార్థినిని వారు అభినందించారు. శాలువా కప్పి ప్రశంసా పత్రం అందించి విషెస్ చెప్పారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.