భద్రాచలం/ మణుగూరు టౌన్, అక్టోబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను జాగృతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సర్కారు తప్పిదాలను ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో పార్టీ భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణలు బుధవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి భద్రాద్రి రామయ్య ప్రసాదాన్ని, ప్రతిమను అందజేశారు. అనంతరం ఆయన వారితో మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో సడలుచున్న నమ్మకం, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన తీరు, దానిపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. భద్రాచలం ఉప ఎన్నికను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు.